వట్టి గ్లూకోజ్ మాత్రమే కాదు...
ఫ్రెష్‌గా పిండి తీసిన బత్తాయి రసం,
షేక్ చేసి క్యాప్ లాగిన షాంపేన్ కూడా!
ఎవర్నీ కుర్చీ వెనక్కి వాలనివ్వడు. ఏ ముఖాన్నీ వేలాడనివ్వడు.
‘మూడ్స్’కి గాలం వేసి వెంట లాక్కుపోతాడు.
క్లాస్ చేత కుయ్యిన విజిల్ వేయిస్తాడు.
మాస్‌పై మంత్రజలం చల్లి మెలొడీ వినిపిస్తాడు.
అతడి మాట, పాట, ఆట... ఎవ్రీథింగ్...
ఒక రీఛార్జ్! వయసుల మధ్య కరచాలనం!!
రండి, ఇవాళ ఈ ‘మాస్’స్ట్రో మ్యూజిక్ వినేందుకు
సండేని ‘ప్లే’ చేద్దాం!

DSP
ఇంటిపేరు : గొర్తి
తల్లిదండ్రులు : శిరోమణి, సత్యమూర్తి
పుట్టింది : 1979 ఆగస్టు 2న వెదురుపాక (తూర్పు గోదావరి జిల్లా)లో
తొలి సినిమా : దేవి (1999) (తెలుగు) ఇనుదు ఇనుదు కాదల్ ఇనుదు
(తమిళం)(తెలుగు ‘ఆనందం’కి రీమేక్)
చేసిన ఆల్బమ్స్ : డాన్స్ పార్టీ, మిస్టర్ దేవి
గాయకునిగా మొదటి చిత్రం : వీరుడు
కుటుంబం : సోదరి పద్మిని (ప్రియదర్శిని ఆర్కిటెక్ట్) సోదరుడు విద్యాసాగర్ (సింగర్)
పాటల రచయితగా : {పేమంటే ఏమిటంటే (ఆనందం) వెచ్చవెచ్చగా (వంశీ)చైల చైలా (శంకర్‌దాదా MBB) ఉదయించే సూర్యుడినడిగా,ఆకాశం తన రెక్కలు (కలుసుకోవాలని)
*******
నారు పోసే వాడు నీరు పోయడు.
పోయాలని రూలూ లేదు.
అసలు- ఆ మాటకొస్తే-
నారు పోసేవాడు నీరూ పోసేస్తే ఇంక నువ్వేం పీకుతావ్?
*********
ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు మంచి కసి మీద ఉన్నారు. ఆయనకు ఒక హిట్ కావాలి. బ్రహ్మాండమైన హిట్. అంతకు ముందే ఆయన విజయశాంతితో ‘స్ట్రీట్‌ఫైటర్’ అనే సినిమా తీశాడు. ఫటాల్. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్. డబ్బు పోయింది. పోతే పోయింది. అంతకు మించి ప్రొడ్యూసర్‌గా తన ఇమేజ్ దెబ్బ తింది. దారుణమైన నష్టం.
ఎమ్మెస్ రాజంటే ఎవరు?
శత్రువు, పోలీస్ లాకప్ వంటి భారీ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్.
అలాంటి తనకు ఎదురు దెబ్బా?
దీని నుంచి కోలుకోవాలి. ఒక కొత్త రకం సినిమాను బ్లాస్ట్ చేయాలి. ఆలోచించి ఆలోచించి ఆయనొక కథ అనుకున్నారు. దానికి ‘దేవి’ అని టైటిల్ పెట్టుకున్నారు. దేవతల్ని మనుషుల్ని మాయల్ని గ్రాఫిక్స్‌ని కలిపి అదరగొడదామనుకున్నారు.
అవన్నీ ఒకెత్తు. మ్యూజిక్ ఒకటీ ఒకెత్తు.
ఈ సినిమాకి మ్యూజిక్ కొత్తగా ఉండాలి. సరిగ్గా చెప్పాలంటే కొత్త మ్యూజిక్ డెరైక్టర్‌ని ఐడెంటిఫై చేసి బడ్జెట్‌ని కంట్రోల్ చేయాలి. అప్పటికే సౌత్‌లో ఏఆర్ రెహమాన్ హవా మొదలయిపోయింది. ‘రోజా’ కోసం పాతిక వేలు ఇచ్చి అంత మంచి సంగీతం రాబట్టుకున్నాడట మణిరత్నం. ఏం... అన్నింటికీ అరవం వాళ్లేనా? మన తెలుగువాళ్లు లేరా? ఏ ఆర్ రెహమాన్ అంతటివాడు కాకపోయినా ఆర్ ఏ రెహమాన్ లాంటివాడు మనకు దొరకడా?
ఎక్కడున్నాడు వాడు?
*
****** మద్రాసులో చాలా ప్రిస్టీజియస్ కాలేజ్ అది. అక్కడ విజువల్ కమ్యూనికేషన్స్‌లో సీట్ రావాలంటే పురచ్చి తలైవి చెప్పినా వినరు. టాలెంట్ ఉండాల్సిందే. అలాంటి కోర్సు కోసం ఆ సంవత్సరం చాలా మంది అప్లయి చేస్తే అందులో పదిహేనుమందిని ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూకు పిలిచారు. ఉన్నది పన్నెండు సీట్లు. పన్నెండూ ఇచ్చేశారు. పదమూడో వాడిగా మాట వరుసకి ఆ కుర్రాణ్ణి పిలిచారు.
చలాకీగా హుషారుగా గొంతులో షాంపేన్ పొంగుతున్నట్టుగా ఉన్నాడు ఆ కుర్రాడు.
హెడ్ ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్ అతణ్ణి మార్చి మార్చి చూశాడు.
‘ఊ... నీకేనా సీట్ కావాల్సింది’
‘అవును. నాకే సార్’
‘చిన్ని చిన్ని ఆశ... పాటను మీ చెల్లాయి మీద షూట్ చేసి ఎడిట్ చేసి అప్లికేషన్‌తో పాటు జత చేసి పంపిన టేప్ నీదేనా’
’అవును నాదే సార్’
‘అదంతా నువ్వొక్కడివే చేశావా’
‘అవును.. నేనొక్కణ్ణే సార్’
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఏం మాట్లాడలేదు. ఒక చిన్న స్లిప్ మీద ఏప్రిల్ 25 మధ్యాహ్నం 2 గంటలకు అని రాసి ఆ కుర్రాడికి ఇచ్చాడు.
‘ఏమిటి సార్ ఇది’
ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు.
‘విజువల్ కమ్యూనికేషన్స్ కొత్త బ్యాచ్‌కి నువ్వు గెస్ట్ లెక్చర్ ఇవ్వాల్సిన టైము’
ఈసారి కుర్రాడు అదిరి పోయాడు.
‘అవునయ్యా. మేము మూడేళ్లలో నేర్పించేది నువ్వు ఇప్పటికే నేర్చుకుని ఉన్నావు. నీకు సీటు అక్కర్లేదు. పోయి ఇండస్ట్రీలో చేరు. ఏదైనా సినిమా తియ్యి’ అన్నాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ జేబులో ఉన్న కర్చీఫ్ తీసి బట్టతల తుడుచుకుంటూ.
ఆ కుర్రాడు సంతోషంతో సంబరంతో వినయంతో తబ్బిబ్బయ్యాడు.
‘నిజమా సార్’
‘నిజమే’ అని ఆ హెడ్ ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్ ఆగడం లేదు.
‘నువ్వు చాలా పెద్దవాడివవుతావయ్యా. చాలా పెద్ద వాడివి’... అని ఆ సంతోషంలో ఆ కుర్రాడి పేరు గుర్తుకు రాక ‘మిస్టర్...’ అంటుంటే ఆ కుర్రాడు అందించాడు-
‘దేవి శ్రీ ప్రసాద్’
*******
ఇంట్లో ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటే పిల్లలకు తిట్లు వస్తాయి. ఇంట్లో ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే పిల్లలకు కొట్లాటలొస్తాయి. ఇంట్లో ఎప్పుడూ పేకాడుతుంటే పిల్లలకు పేకముక్కలు తెలుస్తాయి. ఇంట్లో కాసిన్ని మంచి మాటలు మాట్లాడుకుంటుంటే పిల్లలకు బోలెడన్ని సంస్కారపు తునకలు అందుతాయి.
అదృష్టం. ఆ ఇంట్లో ఎప్పుడూ మంచి పాటలు వినిపించేవి. మంచి మాటలు వినిపించేవి. మంచి సినిమాలు ప్లే అయ్యేవి. మంచి మంచి సృజనకారుల రాకపోకలుండేవి.
ఆ ఇల్లు సినీ రచయిత సత్యమూర్తిది.
తను లోప్రొఫైల్‌లో ఉన్నా తన మాటలతో స్క్రిప్ట్‌తో సినిమాలను హై రేంజ్‌కు తీసుకెళ్లిన రచయిత ఆయన. దేవత... బావా మరదళ్లు... ఖైదీ నెంబర్ 786... పుణ్యస్త్రీ... ఛాలెంజ్... చంటి... పెదరాయుడు... బంగారు బుల్లోడు... అన్నీ ఆయన సినిమాలు. హిట్ సినిమాలు.
అయితే రాయడం మాత్రమే ఆయనకు తెలిసిన విద్య కాదు. ఇంకా చాలా తెలుసు. మంచి ఫొటోగ్రఫీ తెలుసు. మంచి సంగీతం తెలుసు. మంచి సంగీతాన్ని అప్రీషియేట్ చేయడం తెలుసు. మంచి కళను పిల్లలకు పరిచయం చేయడం తెలుసు. అప్పుడప్పుడు తనే పాటలు రాసుకొని తనే బాణీలు కట్టుకొని సరదాగా పాడుకుంటూ ఉండేవారు. ఆ వైబ్రేషన్స్ ఆ ఇంట్లో నిలిచిపోయాయి. అవి ఆ ఇంటి పెద్ద కొడుకు దేవిశ్రీ ప్రసాద్‌ను తాకాయి.
‘అమ్మా... సంగీతం నేర్చుకుంటా’ అన్నాడొక రోజు తల్లితో.
తల్లికి సంతోషం వేసింది. ఎందుకంటే ఆమెకూ సంగీతం అంటే ప్రాణం. పైగా ఆమె తల్లి మంచి గాయని. ఏమో... ఆ లక్షణమే వీడికీ వచ్చిందేమో. కాని వీడు అడుగుతున్నది ఆషామాషీగానా సీరియస్‌గానా అనేది తేలాలి.
‘సంగీతం నేర్చుకోవడం అనేది తపస్సు బాబు. నూరు లెక్కల పుస్తకాలు ఔపోసన పట్టినంత కష్టం. అంతేకాదు చాలా డెడికేటెడ్‌గా ఉండాలి. పొద్దున్నే నాలుగ్గంటలకల్లా లేచి సాధన చేయాలి’ అందామె.
దేవి ఆలోచనలో పడ్డాడు.
నిజంగా అంత కష్టమా సంగీతం అంటే? దానిని సాధించలేమా మనం. ఆలోచించుకుంటూనే నిద్ర పోయాడు.
రాత్రయ్యింది. ఇంకా రాత్రయ్యింది. తల్లి గాఢనిద్రలో ఉండగా ఎవరో లేపినట్టుగా అనిపించి కళ్లు తెరిచి చూసింది. దేవి.
‘అమ్మా. లే. సంగీతం సాధన చేద్దాంలే’ అంటున్నాడు దుప్పటి చుట్టూ కప్పుకొని.
ఆమె అదిరిపోయి, కళ్లు నులుముకొని, టైము చూసింది.
సరిగ్గా- ఐదు నిమిషాలు తక్కువ నాలుగు.
*******

‘నా గురువు మైకేల్ జాక్సన్’ అని ప్రకటించాడు దేవి ఒక రోజు.
అప్పటికి దేవి హైస్కూలు చదువుతున్నాడు. క్లాసు పుస్తకాలు, హోమ్ వర్కూ కాకుండా దేవి చేస్తున్న ఒకే ఒక్క పని మైకేల్ జాక్సన్ వీడియోలు చూడటం. పాటలు పాడేవాడొకడు... పాటలు రాసేవాడొకడు... ఎవరో రాసి ఎవరో పాడితే దానికి డాన్స్ చేసేవాడొకడు... ఏమిటి ఇదంతా.. మొత్తం నేనే చేస్తా... మైకేల్ జాక్సన్‌లా అంతా నేనే చేస్తా అని సవాలు విసురుతున్నాడు.
అప్పటికే దేవికి కీబోర్డ్ వచ్చేసింది.
డాన్సూ వచ్చేసింది.
డిష్... డిష్‌డిష్... ధన్... ధన్‌ధన్... అని నోటితోనే రిథమ్ ఇస్తూ నేల మీద నిలబడటమే మానేశాడు. తల్లి ఇదంతా గమనించింది. ఇది రాకెట్ స్పీడు. ప్రవాహం. దీనిని కొంచెం మందగించేలా చేయాలి. అభిషేకానికి అనువుగా కమండలంలో ఇమడ్చగలగాలి. శాంతంగా ప్రశాంతంగా తనలోకి తనలోన తాను పొంగిపొరలేలా చేయగలగాలి.
ఆ పని చేయగలిగినది ఒక్కటే- శాస్త్రీయ సంగీతం.
‘బాబూ... నిన్ను ఒక గురువు దగ్గరకు తీసుకువెళతాను. ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటావా’ అందామె.
‘అది బాగుంటుందా?’
‘చాలా’
దేవి తలాడించాడు. ఆ సాయంత్రమే కొడుకును తీసుకొని వాళ్ల ఇంటికి రెండు వీధుల అవతల ఉన్న ఒక మాస్టారి దగ్గరకు తీసుకువెళ్లిందామె. ఆ మాస్టారు సంగీతం నేర్పడానికి ఎవరి దగ్గరా డబ్బు తీసుకోడు. అవసరమైతే తనే శిష్యులకు ఏం కావాలో అది అమరుస్తాడు. పెద్దగా మాట్లాడడు. పెద్దగా కోప్పడడు. పువ్వులోని పరిమళం తనంతట తానుగా గుబాళించేలా చేస్తాడు.
ఆయన దేవిని చూశాడు.
‘ఏదీ ఏదైనా పాడు’ అన్నాడు.
దేవి మైకేల్ జాక్సన్ పాట ఒకటి పాడాడు. తల్లి వర్రీగా గురువు వైపు చూసింది. గురువు- చిర్నవ్వు నవ్వి- అదే పాటను అంతకంటే బాగా తన మాండలిన్ మీద పలికించాడు.
దేవి - అరె అనుకొని చూశాడు.
ఇలాగనా అని ఆశ్చర్యపోయాడు.
ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు- తన ఎదురుగా ఉన్న వ్యక్తే తన గురువు. ఎప్పటికీ మరెప్పటికీ.
తర్వాత తల్లితోపాటు ఇంటికి తిరిగొస్తూ తల్లిని గురువు పేరు అడిగాడు.
‘శ్రీనివాస్ నాయనా. అందరూ మాండలిన్ శ్రీనివాస్ అంటారు’ అంది తల్లి.
మాండలిన్ శ్రీనివాస్ - దేవి గురువు.
*******
దేవికి ఇప్పుడు ఒక టైమ్ టేబుల్ అలవాటయ్యింది. ఉదయం నాలుగు నుంచి ఆరు వరకు మాండలిన్ శ్రీనివాస్ దగ్గర శిష్యరికం. ఎనిమిది గంటలకు స్కూల్. మూడింటికి రావడం. ఆరు వరకు ఆటలు, హోమ్ వర్క్. మళ్లీ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకూ సంగీతం.
మద్రాసులో మాండలిన్ శ్రీనివాస్ ఏ కచ్చేరీ చేసినా వెనుక దేవి ఉండాల్సిందే. తంబూరా అందించడం. తాళం వేయడం. గురువు కచ్చేరి ఇస్తుంటే మైమరిచి చూడటం. అన్నింటికంటే దేవి పొందిన బెనిఫిట్ ఏమిటంటే- కచ్చేరీ లైవ్‌లో జరగడం వల్ల ప్రేక్షకుల హావభావాలు గమనించడం.
ఎలాంటి సంగీతానికి వాళ్లు స్పందిస్తున్నారు... ఎలాంటి సంగీతానికి పొంగిపోతున్నారు... ఎలాంటి సంగీతానికి ఏడుస్తున్నారు... ఎలాంటి సంగీతానికి నిర్లిప్తమవుతున్నారు...
ఇది తాను గుర్తుపెట్టుకున్నాడు. శ్రోతల స్పందనే తనకు పాఠం.
ఆ పాఠాల్లో దేవి ఆరి తేరాడు.
*******
డీవియేషన్స్ ఉంటాయి దారిలో. ఒక్కోసారి బాట వదలి పక్కకు వెళ్లి తిరిగి బాటను కనుగొనే పరిస్థితి వస్తుంది. దేవికి కూడా వచ్చింది. ఒకరోజు సత్యమూర్తి ఫారిన్ నుంచి ఓ వీడియో కెమెరా తెప్పించి ఇచ్చారు దేవికి. దాని పేరు ఎమ్ 3000. పానాసోనిక్ కంపెనీ. ఆ రోజుల్లోనే దాని ఖరీదు 45 వేలు. దేవికి ఆ కెమెరాతో లవ్ మొదలయ్యింది. పిచుకను షూట్ చేయడం. ఎలుకను షూట్ చేయడం. వర్షించే మేఘాన్ని షూట్ చేయడం. చెల్లెల్ని తమ్ముణ్ణి పెట్టి మోడల్స్‌గా ర్యాంప్‌వాక్ చేయించడం. ప్రొఫెషనల్ కెమెరామెన్ కూడా పనికిరాడు అన్నట్టుగా సాధన చేయడం.
సత్యమూర్తికి మంచి ఫ్రెండ్ అయిన కెమెరామెన్ లోక్‌సింగ్ ఒకరోజు దేవి షూట్ చేసిందంతా చూసి బుర్ర గీరుకున్నాడు. వర్క్ సామాన్యంగా లేదు. ఇంత చిన్న వయసులో అంత నైపుణ్యమా? ఆ సంగతి తండ్రి దగ్గర ఏం పొగుడుతాం అని చెప్పి వెళ్లి చిరంజీవి దగ్గర పొగిడాడు.
‘సార్. ‘సత్యమూర్తి కొడుకు మేధావిలా ఉన్నాడు. మామూలు కెమెరాతోనే ఇరగదీస్తున్నాడు’ అని చెప్పాడు.
చిరంజీవికి ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే మరుసటి రోజు ఆయనే స్వయంగా సత్యమూర్తి ఇంట్లో ప్రత్యక్షమయ్యి దేవి తీసిందంతా చూసి - దేవిని ముద్దాడి - ‘సత్యమూర్తీ మీ వాణ్ణి ఏం చేద్దామనుకుంటున్నావ్?’ అని అడిగారు.
‘మ్యూజిక్ డెరైక్టర్’ అన్నాడు సత్యమూర్తి.
‘మ్యూజిక్ డెరైక్టర్ ఎప్పుడైనా కావచ్చు. మీవాడిలో మంచి డెరైక్టర్ ఉన్నాడు. ఆ వైపు ట్రైనింగ్ ఇప్పించు’ అని లేచారు చిరంజీవి.
కారు ఎక్కబోతూ దేవిని పిలిచి చెప్పారు- ‘నువ్వు డెరైక్టర్‌వైతే నేను ఫ్రీగా యాక్ట్ చేస్తా. ప్రామిస్’
అది చిన్న కాంప్లిమెంట్ కాదు.
ఆ వయసు కుర్రాడికి దాదాపు ఆస్కార్.
*******
టెన్త్ ఓవర్. ప్లస్ టూ ఫినిష్. డెరైక్టర్ కావడానికి విజువల్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ జాయిన్ అవుదామనుకుంటూ ఉంటే అనుభవం ఎక్కువైందని నో సీట్.
మరేం చేయాలి?
దేవి సొంత ఆల్బమ్స్ చేస్తున్నాడు. పాటలు పాడుతున్నాడు. తన లోకంలో తను ఉన్నాడు. ఇంట్లోనే తన లోకం సృష్టిస్తున్నాడు. సత్యమూర్తిని కలవడానికి వచ్చే సినిమా వాళ్లకు ఇది ఒక రకమైన డిస్టర్బెన్స్. ఒక రకమైన సరదా. ఒకరోజు ఒకాయన మాత్రం దేవి గోలను విని విని ఆగలేక మేడ మీదకు వచ్చేశాడు.
‘హాయ్. నా పేరు ఎమ్మెస్ రాజు. మీ నాన్నగారి ఫ్రెండ్‌ని. ఇప్పుడు నువ్వు పాడుతున్న ట్యూన్ ఎవరిది?’ అన్నాడు.
‘నాదే సార్’ చెప్పాడు దేవి.
‘బాగుంది. నీకో సిట్యుయేషన్ చెబుతా. దానికి ట్యూన్ కడతావా?’ అనడిగాడాయన.
దేవికి సరదాగా అనిపించింది.
‘అలాగే అంకుల్’ హుషారుగా చెప్పాడు.
ఆయన ఓ సిట్యుయేషన్ చెప్పి ‘నేను రేపొస్తా. ట్యూన్ రెడీ చేయ్’ అనేసి వెళ్లిపోయాడు. దేవి ఆ సంగతిని సీరియస్‌గా తీసుకోవాలో సరదాగా తీసుకోవాలో తెలియక వదిలేశాడు. తెల్లారింది. ఎమ్మెస్ రాజు మళ్లీ ప్రత్యక్షమయ్యారు.
‘ట్యూన్ చేశావా?’
దేవి కంగారుపడ్డాడు.
‘అంకుల్... మీరు నిజంగా అన్నారనుకోలేదు’
‘సరే... రేపటికైనా రెడీ చేస్తావా?’
‘ష్యూర్’
ఆ రాత్రంతా నిద్రపోకుండా ఓ ట్యూన్ చేశాడు దేవి.
ఆయనకు వినిపిస్తే ఏం మాట్లాడలేదు. నచ్చలేదేమో అనుకున్నాడు దేవి.
‘ఇప్పుడు నేను ఓ సినిమా చేయబోతున్నా. దానికి మ్యూజిక్ చేస్తావా?’ అడిగాడాయన.
దేవికి కళ్లు తిరిగినంత పనైంది. నిజమా అబద్ధమా. నిజమే. దేవి సినిమాకి మ్యూజిక్ డెరైక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ పేరు ఖరారయ్యింది. 17 ఏళ్లకే బంపర్ ఆఫర్. అయిదు పాటలు... నాలుగు శ్లోకాలు... అదిరిపోయే రీరికార్డింగ్.
దేవి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చాడు.
‘దేవి’ రిలీజయ్యింది. సూపర్ హిట్ అయ్యింది. ఆ వెంటనే దేవి పేరు కూడా. ఒకేసారి పది ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఏం చేయాలి? దేవి అన్నిటినీ రిజెక్ట్ చేశాడు. సత్యమూర్తి ఆశ్చర్యపోయారు.
‘లేదు నాన్నా... అన్నీ దేవిలాంటి పాము సినిమాలే. అవిగాని చేస్తే నేనిక పాము బూర ఊదుకోవాల్సిందే’ చెప్పాడు దేవి.
దేవికి ధైర్యం వేరే ఉంది.
మొదటి సినిమాకు ఎమ్మెస్ రాజు అవకాశం ఇచ్చారు.
వెంటనే ఆయన భారీ సినిమా ‘దేవీపుత్రుడు’ మొదలెట్టారు.
ఆ అవకాశం కూడా తనకే వస్తుంది.
చేస్తే అలాంటి పెద్ద సినిమా చేయాలి. చిన్న చిన్న సినిమాలు ఎందుకు? ఎమ్మెస్ నారు పోశారు. ఆయనే నీరు పోస్తారు.
అని ఎదురు చూస్తూ కూచుని ఉన్నాడు దేవి.
కాని దేవి అనుకున్నట్టుగా జరగలేదు. వేరే ఏవో కారణాల వల్ల బిజినెస్ ప్యాకేజ్‌లో భాగంగా దేవిపుత్రుడు మ్యూజిక్ ఇంకొకరికి వెళ్లింది. దేవికి కాదు. దేవి అదిరిపోయాడు. టీనేజ్‌లో ఉన్న కుర్రాడు. కలలు కంటున్న కుర్రాడు. కలలకు వేరొకరిపై ఆధారపడిన కుర్రాడు. ఆదిలోనే ఇలాంటి అనుభవాన్ని ఊహించలేదు.
డిప్రెషన్.
వచ్చిన సినిమాలు వదులుకున్నాడు.
రావలసిన సినిమా రాలేదు.
ఏం చేయాలి? ఈ గ్యాప్‌లో కాలం ఊరికే ఉంటుందా
*******
ఆంటీ కూతురా... అమ్మో అప్సరా ముస్తాబదిరింది....
మణిశర్మ రెచ్చిపోతున్నాడు.
రామ్మా... చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా అని రేగిపోతున్నాడు.
రోజావే... చిన్ని రోజావే... అని ఎస్‌ఏ రాజ్‌కుమార్ రెడీ.
రమణగోగుల, ఆర్‌పి పట్నాయక్, చక్రి... అందరూ బరిలో దిగి అవకాశాలను వేటాడుతున్నారు. ఇలాంటి సమయంలో దేవి మళ్లీ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
వీళ్ల హోరులో తన పాట ఎప్పుడు వినిపించాలి.
తను ఎప్పుడు బయట పడాలి?
*******
కోడి రామకృష్ణ నూరు సినిమాలు తీశారు. ఇంకో నూరు సినిమాలు తీసినా ప్రతి సినిమానూ తన మొదటి సినిమాగా తీయడం ఆయన అలవాటు. ప్రతి సినిమాకు తగిన న్యాయం చేసేవాళ్లను వెతుకుతుంటారాయన. ఇప్పుడు ఆయన చేతికి ‘నవ్వుతూ బతకాలిరా’ అనే సినిమా వచ్చింది.
జేడీ చక్రవర్తి హీరో... శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్... మార్కెట్‌ను అనుసరించి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డెరైక్టర్‌ని తీసుకోవచ్చు. కానీ ఆయనకు దేవి గుర్తుకొచ్చాడు. తాను డెరైక్ట్ చేసిన దేవికి పని చేసిన కుర్రాడికి ఇంకో చాన్స్ ఇవ్వాలని కోడి రామకృష్ణకు అనిపించింది.
దేవిని పిలిచి ‘ఒక్క పాట హిట్ చేయ్ చాలు. అన్నీ అక్కర్లేదు’ అన్నారాయన.
దేవి అప్పటికే కసిమీదుతున్నాడు.
‘కోనసీమ కుర్రదాన్నిరో...’ లాంటి మాస్ పాటలను మోతెక్కించాడు.
‘నవ్వుతూ బతకాలిరా’ సినిమా యావరేజ్... కానీ పాటలు సూపర్‌హిట్. ఒకావిడ ఇంటర్నెట్‌లో ఈ పాటల గురించి రివ్యూ రాస్తూ ‘తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త బహుమతి దేవిశ్రీప్రసాద్’ అని ప్రశంసించింది.
తొలి గుర్తింపు. ఇక మలి గుర్తింపు రావాలి. వచ్చింది. శ్రీను వైట్ల తీసిన ‘ఆనందం’ రూపంలో.
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా... హిట్.
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా... సూపర్ హిట్.
‘ఆనందం’ సినిమాతో పాటు ఆనందం ఆడియో దుమ్ము లేపేసింది. ఎవరితడు? దేవిశ్రీ ప్రసాద్ అట. ఎవరితడు? అని ఒకటే ఎంక్వయిరీలు.
అది తెలుసుకునేలోపే ‘సొంతం’ వచ్చింది.
ఆ తర్వాత ‘కలుసుకోవాలని’.
ఆ తర్వాత ’ఖడ్గం’.
ఆ తర్వాత నాగార్జున ‘మన్మథుడు’.
గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది...
పెద్ద హిట్.
ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ టాప్ డెరైక్టర్.
కానీ చాలదు. చిరంజీవి సినిమాకు పాటలు ఇవ్వని
వాడు టాప్ డెరైక్టర్ ఎలా అవుతాడు?
*******

డెరైక్టర్ రాజూ హిరాణి దేశాన్ని షేక్ చేశాడు. మున్నాభాయ్ ఎంబిబిఎస్‌తో కొత్తరకం ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రవేశపెట్టాడు. ఆ లెవల్ సినిమాకు తెలుగులో సరిజోడి ఎవరు? ఇంకెవరు చిరంజీవే! శంకర్‌దాదా ఎంబిబిఎస్ మొదలైంది. అందరిలోనూ టెన్షన్. ఏ క్యారెక్టర్ ఎవరికి పోతుందో? ఏ డిపార్ట్‌మెంట్ ఎవరికి దక్కుతుందో. ముఖ్యంగా మ్యూజిక్. అప్పటికి చిరంజీవికి మణిశర్మే పర్మినెంట్. ఇప్పుడూ ఇంతేనా... ఇప్పుడూ.
కానీ కాల్ దేవికి వచ్చింది.
‘శంకర్ దాదా ఎంబీబీఎస్’...
అవతలివైపు మాట పూర్తి కాక ముందే ‘చేస్తా... చేస్తా... గ్యారంటీగా నేనే చేస్తా’ అని పెద్దగా అరిచాడు దేవి. తన దర్శకత్వంలో ఫ్రీగా యాక్ట్ చేస్తానన్న చిరంజీవి తన సంగీత దర్శకత్వంలో యాక్ట్ చేయడానికి అంగీకరించారు.
ఆ సినిమా రిలీజైంది. దేవి పేరు మోగిపోయింది. తను ఇంట్రడ్యూస్ చేసిన కుర్రాడు తన ప్రమేయం లేకుండా తన దారి తాను వెతుక్కోగలిగాడు అన్న సంతృప్తి ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజుకు దక్కింది.
చాలా రోజుల తర్వాత ఆయన దేవికి ఫోన్ చేశాడు.
‘రే... నా సినిమా నువ్వు చేయాలి’
‘చేస్తాను అంకుల్. పేరేమిటి’
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’.
సూపర్ హిట్.
*******
సాధారణంగా తమిళ మ్యూజిక్ డెరైక్టర్లు తెలుగులో దుమ్ము రేపడం ఆనవాయితీ. కేవీ మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హేరీస్ జైరాజ్...
ఏం... ఒక తెలుగు మ్యూజిక్ డెరైక్టర్ తమిళంలో
దుమ్ము రేపకూడదా.
రేపాడు. దేవి.
ఎక్స్‌క్యూజ్‌మీ మిస్టర్ మల్లన్నా
ఓ కాఫీ తాగుదాం ఆవోనా...
విక్రమ్‌కు మల్లన్న ఆడియో హిట్.
చూడొద్దే నను చూడొద్దే కత్తిలాగ నను చూడొద్దే...
సూర్యకు ‘ఆరు’ ఆడియో హిట్. నిన్న మొన్నటి
‘సింగం’ ఆడియో కూడా హిట్.
దూసుకుపోతున్నాడు దేవి.
ఆగడం లేదు.
ఆపడమూ సాధ్యం కాదు.
*******
ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర నారు ఉందా
లేదా చూసుకోవాలి.
నారు ఉంటే నీరు కోసం వెతుక్కోకుండా మనమే
రంగంలో దిగాలి.
ప్రయత్నం చేస్తే పనులు అవుతాయి.
ప్రయత్నం చేస్తే అవకాశాలు వస్తాయి.
ప్రయత్నం చేస్తే సక్సెసూ అవుతారు.
ప్రయత్నం చేస్తే రీఛార్జ్ అవుతారు.
ఇన్నెందుకు - ప్రయత్నం చేస్తే మీరు దేవిశ్రీ ప్రసాద్
అవుతారు.
బాత్రూమ్‌లో పుట్టిన పాట
కృష్ణవంశీ డెరైక్షన్‌లో ‘ఖడ్గం’ సినిమా. ఎంతో ఇష్టపడి మ్యూజిక్ చేస్తున్నాడు దేవి.
ఓ రోజు సడన్‌గా ఫోన్ చేశారు కృష్ణవంశీ. ‘‘నెక్ట్స్ షెడ్యూల్‌లో తీద్దామనుకున్న పాట ఇమ్మీడియెట్‌గా తీయాల్సి వస్తోంది. సోనాలిబింద్రే కాల్షీట్లు రెడీగా ఉన్నాయి. అర్జంట్‌గా పాట కావాలి’’ అని పీక మీద కత్తి పెట్టినంత పనిచేశారు. ఇప్పటికిప్పుడు రొమాంటిక్ సాంగ్ రెడీ చేసేయాలి. ఆ టెన్షన్‌లో రెండుమూడు సార్లు బాత్రూమ్‌కి వెళ్లాడు దేవి. అక్కడే ఓ ఆలోచన వచ్చింది. అదే ‘నువ్వు... నువ్వు...’ పాట. సీతారామశాస్త్రి లిరిక్ రాశారు. ఫోన్‌లో పాట విన్న కృష్ణవంశీ ‘‘అదరగొట్టావ్ దేవీ. నువ్వు నా ఎదురుగా ఉంటే గట్టిగా వాటేసుకునే వాణ్ణి’’ అని అభినందించారు. ‘ఖడ్గం’ ఎంత హిట్టయ్యిందో ఆ పాట అంతకు రెట్టింపు హిట్టయ్యింది.
హీరోగా బోలెడన్ని ఆఫర్లు
దేవి పాటల్లో ఎంత ఎనర్జీ, గ్లామర్ కనిపిస్తాయో తనలో కూడా అవే కనిపిస్తాయి. ఆడియో ఫంక్షన్‌లో దేవి డయాస్‌పైకి ఎక్కితే సందడే సందడి. హీరోహీరోయిన్లు కూడా అతని చుట్టూ మూగుతారు. ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రాల్లో ఓ పాటలో చిరంజీవితో కలిసి దేవి స్టెప్పులేస్తూ కనిపిస్తారు. త్వరలో విడుదల కానున్న తమిళ సినిమా ‘వెడీ’ లో కూడా ఆయన ఓ పాటలో నటించారట. మరి పూర్తిస్థాయి హీరోగా ఎప్పుడు? అంటే నవ్వేస్తారాయన. ‘‘నటించాలని నాక్కూడా ఉంది. కానీ నా వృత్తికి న్యాయం చేయడానికే టైమ్ సరిపోవట్లేదు. ఇక యాక్టింగ్ కూడా అంటే టైం స్పెండ్ చేయడం చాలా కష్టం’’ అని చెబుతారు దేవి. చాలా పెద్ద పెద్ద నిర్మాతలే దేవిని హీరోగా చేయమని ఆఫర్లు ఇచ్చారు. అశ్వనీదత్, అల్లు అరవింద్, ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. కానీ దేవికి సంగీతమే ప్రపంచం. ప్రస్తుతానికి రెండో ఆలోచన లేదు. ఏమో... భవిష్యత్తులో తను హీరోగా సినిమా రావచ్చేమో! అల్లు అరవింద్ అయితే డెరైక్షన్ ఆఫర్ కూడా ఇచ్చారట. ‘‘హీరోగా అయినా, డెరైక్టర్‌గా అయినా మా సంస్థలో ఎనీటైమ్ నీతో సినిమా చేయడానికి రెడీ’’అని చెప్పారట.
0 comments:
Post a Comment