Tuesday, December 13, 2011

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా!
షార్ట్‌కట్‌లో జె.ఆర్.డి. ఇంకా షార్ట్‌గా... జే.
పేర్లకు షార్ట్‌కట్‌లు ఉంటాయి.
దారులకు షార్ట్‌కట్‌లు ఉంటాయి.
కానీ - కలలు నెరవేర్చుకోడానికి లక్ష్యాలకు దారులు వేసుకోడానికి లాంగ్ అవర్స్... వెరీ లాంగ్ అవర్స్ పనిచెయ్యాలి.
‘జే’ విజయ రహస్యం ఇదే.
దేశ నిర్మాణానికి ‘ఉక్కు’పాలు పట్టించారు జే.
జాతి పురోగతికి రెక్కలు తొడిగారు జే.
జాతీయ పతాకంలా...
దేశ అతిశయ పతాకమై రెపరెపలాడారు జే!
అజేయుడైన ఆ పారిశ్రామిక సార్వభౌముడి బయోగ్రఫీ ఇది.

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా (జె.ఆర్.డి.)
29 జూలై 1904 - 29 నవంబర్ 1993

జన్మస్థలం : పారిస్, ఫ్రాన్స్
తల్లిదండ్రులు : రతన్‌జీ దాదాభాయ్ టాటా
తల్లి : సూజన్ (సూనీ)
తోడబుట్టినవారు :సిల్లా, రోడాబె, దరబ్, జంషెడ్. (సిల్లాకు రోడాబెకు మధ్యలో జె.ఆర్.డి)
భార్య : థెల్కా వికాజీ
పిల్లలు : లేరు
ప్రతిష్ఠ : భారతరత్న అవార్డు



జె.ఆర్.డి. ది ప్రేమ వివాహం. థెల్మా వికాజీని అయన ప్రేమించి, పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు ఆమెతో రెండు నిమిషాలు ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఆమె చుట్టూ ఉన్న పిల్లలకు ఏదో ఒక లంచం ఇచ్చి అక్కడి నుంచి పంపించేవాడు!

లాక్‌హీడ్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ. కాలిఫోర్నియా.
గుయ్యిన విడిపరికరాలు తయారవుతున్నాయి. అన్నిటినీ కలిపితే జుయ్యిన పైకి ఎగిరే ఒక విమానం! ఆసక్తిగా చూస్తున్నాడు జె.ఆర్.డి. టాటా. ఎంత ఎత్తుకు ఎదిగింది అమెరికా!! కానీ అక్కడొక లూయీ బ్లేరియట్ పుట్టకుండా ఎలా సాధ్యం? అదే ఆలోచిస్తున్నారు జె.ఆర్.డి.
లూయిన్ బ్లేరియట్... ఫ్రెంచి ఏవియేటర్! విమానాలు నడుపుతాడు. ఎలా నడుపుతాడంటే, ఎక్కినవాళ్లకు దిగాలనిపించదు. దిగాక కూడా దిగినట్లనిపించదు. భూమి గిర్రున తిరుగుతున్నట్లుంటుంది. అన్ని చక్కర్లు కొట్టిస్తాడు. చెవులు పిండుతాడు. అతడి మీసాలు కూడా మీసాల్లా ఉండవు. విమానం రెక్కల్లా ఉంటాయి. పిల్లవాడిగా ఉన్నపుడు అతడి గురించి విన్నాడు జె.ఆర్.డి. కాస్త పెద్దవాడయ్యాక అతడిని నేరుగా చూశాడు.
ఎగురుతున్న పక్షిని మొదటిసారి చూసినప్పుడు జె.ఆర్.డి.కి ఏమనిపించిందో తెలీదు. బ్లేరియట్‌ను చూసినప్పుడు మాత్రం ఒకటనిపించింది. తను కూడా బ్లేరియట్‌లా విమానం తోకకు తాడు కట్టితిప్పినట్లు ఆకాశంలో గిరగిర తిప్పేయాలని! అలా జె.ఆర్.డి.కి హీరో అయ్యాడు బ్లేరియట్. పక్షులు చీకట్లో ఎగరవు నిజమే కానీ, బ్లేరియట్‌ను గుర్తుచేసుకుంటే జె.ఆర్.డి. నిద్దట్లో కూడా పక్షిలా మారిపోయి ఖండాలు దాటేస్తుంటాడు.
ఇండియాలో తొలి పైలట్ లెసైన్స్ జె.ఆర్.డి. టాటాది. దాని వెనుక ఉన్న ఇన్‌స్పిరేషన్ బ్లేరియట్‌ది.
...కానీ, బ్లేరియట్ పుట్టని అమెరికా అంత గొప్పది ఎలా అయింది?!
లాక్‌హీడ్ కర్మాగారంలోని యంత్రాల కర్ణకఠోర ధ్వనులను శ్రావ్యంగా వింటూ - చేతులు వెనక్కు కట్టుకుని - ముందుకు నడుస్తున్నారు జె.ఆర్.డి. ఇండియా నుంచి పనిగట్టుకుని అక్కడికి వచ్చారు ఆయన. విమానాల్ని ఎలా మలిస్తే ఎలా నడుస్తాయో తెలుసుకోవడం కోసం వచ్చారు. అప్పటికి ‘ఎయిర్ ఇండియా’ లేదు. ఇండియాను స్వేచ్ఛగా ఎగరనిచ్చే స్వాతంత్య్రమూ లేదు. ఇండియాలో ఎప్పటికైనా - ప్రయాణికుల కోసం విమానాలను నడిపే కంపెనీ పెట్టాలన్న ఒకే ఒక ఆలోచన ఆయన్ని ఇంతదూరం రప్పించింది.
చాలాసేపటిగా ఫ్యాక్టరీలో కలియదిరుగుతున్నారు జె.ఆర్.డి. గొంతు తడారినట్లనిపిస్తుంటే మంచి నీళ్ల కోసం చూశారు. లాక్‌హీడ్ అధికారులు వాటర్ డిస్పెన్సర్లు ఉన్నవైపు ఆయన్ని నడిపించారు. అక్కడ రెండు డిస్పెన్సర్లు ఉన్నాయి. రెండు ఎందుకంటే.. ఒకటి తెల్లవాళ్ల కోసం. ఇంకొకటి నల్లవాళ్ల కోసం!
జె.ఆర్.డి. తిన్నగా, నల్లవాళ్లకు కేటాయించిన డిస్పెన్సర్ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగబోయారు. అది చూసి తెల్ల అధికారి ఒకరు పరుగున వచ్చారు. ‘‘వొద్దొద్దు మిస్టర్ జె.ఆర్.డి. అది మన కోసం కాదు’’ అన్నారు.
జె.ఆర్.డి. ఆశ్చర్యపోయారు. ‘‘నేను తెల్లవాడిని కాదు కనుక అది నా కోసం కేటాయించినదే అవుతుంది కదా’’ అన్నారు.
ఆ క్షణంలో ఆయనకెవ్వరూ అడ్డు చెప్పలేదు. ఆ తర్వాతెప్పుడూ అక్కడ రెండు డిస్పెన్సర్‌లు కనిపించలేదు.
అమెరికా గొప్ప దేశమే.
అంతకన్నా గొప్ప మానవతావాది జె.ఆర్.డి.!
తను గొప్ప వ్యక్తినని జె.ఆర్.డి. ఏనాడూ, ఎక్కడా చెప్పుకోలేదు. కానీ ఆయన పేరు, ప్రస్తావన లేకుండా భారతదేశం గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కుదరని పని. స్వాతంత్య్రం వచ్చాక దేశ పునర్నిర్మాణానికి వెన్ను, సున్నం అందించిన జె.ఆర్.డి. రిటైర్ అయ్యేనాటికి ఆయన చేతికింద యాభైకి పైగా అత్యంత కీలకమైన పరిశ్రమలు ఉన్నాయి. పదివేల కోట్ల రూపాయలకు మించిన టర్నోవర్ ఉంది. స్టీల్, కెమికల్స్, ఏవియేషన్, ఇంజినీరింగ్, సైన్స్. వీటిల్లో కొన్ని... స్వాతంత్య్రానికి ముందే పుట్టినవి. జె.ఆర్.డి. పుట్టింది కూడా స్వాతంత్య్రానికి పూర్వమే.

*******

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా (జె.ఆర్.డి.) పుట్టింది పారిస్‌లో. పార్శీల కుటుంబం. అయితే తననొక భారతీయుడిగా మాత్రమే ఎవరైనా గుర్తించాలని ఈ పారిశ్రామికవేత్త జీవితాంతం కోరుకున్నారు. భారతీయతపై ఆయన పట్టింపు ఎంత గట్టిదో తెలియజెప్పే సంఘటనలు అనేకం ఉన్నాయి. ఓసారి ప్రఖ్యాత రచయిత్రి గీతా పిరామల్ జె.ఆర్.డి.ని ఇంటర్వ్యూ చేసేందుకు బాంబే హౌస్ చేరుకున్నారు. బాంబే హౌస్... టాటా గ్రూపు సంస్థల ప్రధానకేంద్రం. ఆవిడ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు జె.ఆర్.డి.
ఇంటర్వ్యూ మొదలైంది. అయితే మొదటి ప్రశ్న గీతా పిరామల్ కాకుండా, జె.ఆర్.డి. అడిగారు.
‘‘ఇంటర్వ్యూ ప్రధానంగా ఏ అంశంపై సాగబోతోందో తెలుసుకోవచ్చా’’ అని.
‘‘పారిశ్రామిక రంగంలో అగ్రగాములుగా నిలిచిన పార్శీల గురించి రాయబోతున్నాను’’ అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు గీత.
కోపాన్ని ఆపుకున్నారు జె.ఆర్.డి.
‘‘నేను కేవలం ఒక పార్శీగానే ఎందుకు మిగలాలి? భారతీయుడిగా ఉండలేనా?’’ అని అడిగారు. గీతా పిరామల్ బిత్తరపోయారు. ఇంటర్వ్యూ అక్కడితో కట్.
జె.ఆర్.డి. నిరాడంబరంగా ఉంటారు. నిజాయితీని ఇష్టపడతారు. దేశాన్ని ప్రేమిస్తారు. తేడా వస్తే దేశ నాయకులనైనా వేలెత్తి చూపుతారు. ఆయనలో ఇంకా చాలా క్వాలిటీలు ఉన్నాయి. జీవితానికి క్రమశిక్షణ ముఖ్యం అంటారు. సమయాన్ని గౌరవించలేని వారు వ్యక్తిగా తమ గౌరవాన్ని కోల్పోతారని హెచ్చరిస్తారు. చేస్తున్న పనిపై శ్రద్ధ, ధ్యాస లేకపోవడం... సోమరితనం కన్నా కూడా దారుణమైన నైతిక నేరం అంటారు. భారతదేశంలోని రెండు మూడు తరాలను బాధ్యతాయుతమైన పారిశ్రామిక వేత్తలుగా మలిచిన వ్యక్తిత్వం ఆయనది. తల్లిదండ్రుల నుంచి ఆయనకు సంక్రమించిన సంపద అది!
జె.ఆర్.డి తండ్రి ఆర్.డి. (రతన్‌జీ దాదాభాయ్ టాటా) భారతీయుడు. జె.ఆర్.డి తల్లి సూజన్ బ్రియర్. ఫ్రెంచి వనిత. వాళ్లది ప్రేమ వివాహం. ఆర్.డి.తో పెళ్లయ్యాక ఆవిడ పార్శీ మతం స్వీకరించారు. ‘సూనీ’గా పేరు మార్చుకున్నారు. ‘టాటా’ అన్నది రతన్‌జీ దాదాభాయ్‌కి జంషెడ్జీ నస్సెర్‌వాన్జీ టాటా నుంచి పారిశ్రామికంగా అందివచ్చిన పేరు! దేశ అవసరాలను పదేళ్ల ముందే కనిపెట్టగల దార్శనిక పారిశ్రామిక వేత్త జంషెడ్జీ. మొదట ఆయన టెక్స్‌టైల్స్ బజినెస్ ప్రారంభించారు. తర్వాత ఉక్కు పరిశ్రమను నెలకొల్పారు. భారతదేశంలోనే అది మొట్టమొదటి స్టీల్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత స్టీల్‌ని, టెక్స్‌టైల్స్‌ని కలిపి ‘టాటా అండ్ సన్స్’తో జాయింట్ వెంచర్‌గా మార్చారు. అందులో ఒక భాగస్వామి జంషెడ్జీ కుమారుడు దొరాబ్ టాటా. ఇంకో భాగస్వామి జంషెడ్జీ భార్య తరఫు బంధువు ఆర్.డి.
జంషెడ్జీని జె.ఆర్.డి. టాటా చూడలేదు. జె.ఆర్.డి. పుట్టడానికి రెండు నెలల ముందే జంషెడ్జీ మరణించారు.
జె.ఆర్.డి ప్రతిభను అతడి తల్లి చూడలేదు. జె.ఆర్.డి.కి పందొమ్మిదేళ్లప్పుడే ఆమె మరణించింది.
‘టాటా సన్స్’లో తన అప్పులు తీర్చడానికి కొడుకెన్ని తిప్పలు పడిందీ ఆర్.డి చూడలేదు. జె.ఆర్.డి.కి ఇరవై రెండేళ్లప్పుడే ఆయన మరణించాడు.
జీవితం ఎప్పుడు మొదలయ్యిందో, ఎక్కడ మొదలయ్యిందో జె.ఆర్.డి.కి గుర్తు లేదు. గుర్తు లేనంతగా అతడు పనిలో పడిపోయాడు. ఎప్పుడైనా ఒకసారి - ఏకాంతంలో... అతడికి అమ్మ గుర్తుకు వచ్చేది. అమ్మమ్మ ఆడించిన ఆటలు గుర్తుకు వచ్చేవి. ఫ్రాన్సుకు, ఇండియాకు మధ్య గడిచిన బాల్యంలోని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి. ఆ జ్ఞాపకాలు... అతడి చుట్టూ తిరిగే విమానాలు అయ్యేవి.

*******

ఫ్రాన్స్‌లోని హార్డెలాట్ సిటీ.
అక్కడి బీచ్‌లో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ పైన ఎరుగుతున్న విమానాన్ని చూశాడు చిన్నారి జె.ఆర్.డి.
మొదట ఆశగా చూశాడు. తర్వాత ఆసక్తిగా చూశాడు. అతడి ఆశని, ఆసక్తిని చూసి - ‘‘మా డాడీకి చెప్పి జాయ్‌రైడ్ కి తీసుకెళ్తాలే’’ అని జె.ఆర్.డి.కి మాటిచ్చాడు ఒక స్నేహితుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ స్నేహితుడి తండ్రి పేరు బ్లేరియట్. లూయీ బ్లేరియట్. తర్వాత్తర్వాత ఆయనే జె.ఆర్.డి.కి ఆరాధ్యుడయ్యాడు. ఆయన స్ఫూర్తితోనే - జె.ఆర్.డి. పాతికేళ్ల లోపే పైలట్ అయ్యాడు! ముప్పై నిండకుండానే సొంత విమానయాన సంస్థకు ఓనర్ అయ్యాడు. చివరికి భారత పారిశ్రామిక రంగానికే పైలట్ అయ్యాడు.
జె.ఆర్.డి. టాటా పేరు వినిపించినప్పుడు యావత్ భారతదేశం కంటే ముందు ముంబైలోని కెథడ్రాల్ అండ్ జాన్ కన్నన్ స్కూల్ ఉప్పొంగుతుంది. ఆయన చదువుకున్నది అక్కడే. ఆయనతో అనుబంధం ఉన్న సంస్థల యజమానులు, సన్నిహితులు, సాధారణ వ్యక్తులు, ప్రముఖులు, టాటా ఉద్యోగులు ఆయన్నొక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా భావిస్తారు. ఆయన మాటల్లో అంతటి మంత్రం ఉంది మరి! నిజానికది మాటల్లోని మంత్ర శక్తి కాదు, జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్న ఒక వ్యక్తి అనుభవాల నుంచి అనుక్షణమూ పలుకుతుండే అంతర్వాణి.
చదువు పూర్తయ్యాక ఫ్రెంచి సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఈ భారతీయుడు... తండ్రి ఆదేశం మేరకు ఇండియా వచ్చి ‘ఇండస్ట్రియల్ దళపతి’గా దేశాన్ని నడిపించడం వెనుక ఆయన సామర్థ్యం ఎంత ఉందో, విధుల నిర్వహణలో ఆయన నెలకొల్పిన విలువల ప్రభావం అంతగానూ ఉంది. లాభాలతో బరువెక్కిన ప్రతిమ కాదు జె.ఆర్.డి. జీవితం. దేశభక్తి, వ్యాపారశక్తి కలిసి ప్రతిష్టించిన ఉత్తేజపూర్వక విగ్రహం.

*******

‘‘మీ విజయ రహస్యం ఏమిటి?’’

ఎవరో అడిగారు జె.ఆర్.డి.ని.
‘‘నో సీక్రెట్. జస్ట్ లాంగ్ అవర్స్’’ - చెప్పారు జె.ఆర్.డి.
వారానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై గంటలు పనిచేస్తారాయన! ఇక విజయం ఏ దారిన ఆయన కన్నుగప్పి తప్పించుకుంటుంది? అందుకే ఆయన యాభై రెండేళ్ల పాటు ‘టాటా’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా విజయాలు సాధించారు. ఉక్కు, విద్యుచ్ఛక్తి, కెమికల్స్, ఆటోమొబైల్స్... ఇలా ఎన్నో పరిశ్రమలతో ఆయన దేశానికి స్వయం సమృద్ధిని సాధించి పెట్టారు. జె.ఆర్.డి. ఉండగా టాటా జంషెడ్‌పూర్‌లోని ఉక్కు కర్మాగారంలో ఒక్క రోజైనా సమ్మె జరగ లేదు!
జె.ఆర్.డి.ని ఆయన కన్నా వయసులో పెద్దవాళ్లు, సన్నిహితులు చనువుగా ‘జే’ అని పిలుస్తారు. ప్రపంచం ఆయన్ని గౌరవంగా... ‘మిస్టర్ టాటా’ అంటుంది. టాటాల మహాసామ్రాజ్యం ఆయనకు ఆపేక్షగా పెట్టిన కిరీటమే ‘టాటా’ అన్న పేరు. అందుకే అది పేరులా ఉండదు. ఒక బిరుదులా అనిపిస్తుంది! టాటా కూడా పైకి ఒక పెద్ద వ్యాపారవేత్తలా కనిపిస్తారు కానీ, లోలోపల అనేకమంది టాటాల కలయిక జె.ఆర్.డి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్, ఎడ్యుకేషన్, ఎక్స్‌పర్ట్ మేనేజ్‌మెంట్... ఇలా ప్రతి రంగంలోని అవసరాలను గుర్తించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. అందుకు అవసరమైన వనరులను సమకూరుస్తారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ జె.ఆర్.డి. నెలకొల్పినవే. ఆయన ఇచ్చిన నిధులతోనే హోమీ భాభా పరిశోధనా సంస్థ ఆవిర్భవించింది. మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోతే మేధస్సు నిరుపయోగమౌతుందని అంటారు జె.ఆర్.డి. ఆ కాలంలో గనుక ఇలాంటి వ్యక్తులు కనీసం ఇంకో ఇద్దరు ముగ్గురైనా ఉంటే భారతదేశం ఒక సంపన్న దేశం అయివుండేదని ఆయన ఆత్మకథ ‘బియాండ్ ద లాస్ట్ బ్లూ మౌంటేన్’ను రాసిన బయోగ్రఫర్ ఆర్.డి.ల అభిప్రాయం.
జనాభాను నియంత్రించకపోతే దేశాభివృద్ధి కుంటుపడుతుందని మొదట హెచ్చరించిన పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి. అయితే హెచ్చరిక చేసి ఊరుకోలేదు ఆయన. కుటుంబ నియంత్రణకు పథకాలను కూడా రూపొందించారు. సామాజిక ధోరణులను అధ్యయనం చేసి, సామాజిక వైరుధ్యాలకు అవసరమైన పరిష్కారాలను పరిశీలించడం కోసం ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్’ను స్థాపించారు. జె.ఆర్.డి. ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు.
క్యాన్సర్ మహమ్మారి గురించి మనకసలు ఏమీ తెలియనప్పుడు, మరణం తప్ప మరో మందుగానీ, చికిత్స గానీ లేదని అనుకుంటున్నప్పడు ‘టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్’ని స్థాపించారు జె.ఆర్.డి. ఒకనాడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన క్యాన్సర్ చికిత్సా సదుపాయాలు నేడు మనకూ అందుబాటులోకి వచ్చాయంటే ఆయన కృషి ఫలితమే.
ఒక్కమాటలో చెప్పాలంటే స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని ‘పాలించిన’ ఏకైక పారిశ్రామికవేత్త ఆయన. డెబ్బై ఏళ్ల వయసులోనూ ముంబై నుంచి లండన్ వరకు విమానాన్ని నడుపుకుంటూ వెళ్లిన జె.ఆర్.డి.కి. పరిశ్రమల స్టీరింగ్‌తో దేశాన్ని నడపడం ఏమంత పెద్ద విషయం?
‘‘జస్ట్ లాంగ్ అవర్స్’’ అని కదా చెప్పారు జె.ఆర్.డి. తన విజయ రహస్యం గురించి!
కానీ ఒక్కరే లాంగ్ అవర్స్ కూర్చుని పని చేస్తే విజయం వరిస్తుందా? అందర్నీ కలుపుకుని పోవాలి. సంస్థలో కింది వారికి, పైవారికి... ఎవరికి తగిన గుర్తింపు వారికి ఇవ్వాలి. చిన్నాచితక ఉద్యోగులకు సైతం తామే సూత్రధారులమన్న నమ్మకం కలిగించాలి. జె.ఆర్.డి. ఆ పనే చేశారు. పెద్ద ప్రాజెక్టయినా, తన ఉద్యోగికి వచ్చిన చిన్న సమస్యైనా ఒకేలా శ్రద్ద తీసుకుని పనిచేస్తారాయన. ఆయన సమక్షంలో ప్రతి వ్యక్తి అభిప్రాయానికి విలువ ఉంటుంది. అందుకే టాటా సంస్థలతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఆయన ఔదార్యం గురించి, ఆయన పాటించే విలువల గురించి పదే పదే గొప్పగా చెప్పుకుంటారు.

*******

తాజ్ గ్రూప్ హోటళ్ల ఒకప్పటి వైస్ ప్రెసిడెంట్ టి. దాము దగ్గర జె.ఆర్.డి.కి సంబంధించి కొన్ని అమూల్యమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 2004లో జె.ఆర్.డి. శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వాటిని ఆయన ‘ది హిందూ’ పాఠకులతో పంచుకున్నారు. ముంబై హౌస్‌లోని టాటా ట్రస్ట్‌లో దాము ట్రెయినీగా ఉన్నప్పుడు... అతడు రోజూ వచ్చే సబర్బన్ రైలు ఆ వేళ ఆలస్యం కావడంతో ఆఫీస్‌కి లేటయింది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కారిడార్‌లోంచి నడుచుకుంటూ వెళుతుంటే అతడికో షార్ట్‌కట్ ఆలోచన వచ్చింది. తూర్పు వైపు ఉన్న లిఫ్ట్‌లోంచి తను ఎందుకు వెళ్లకూడదూ... అనుకున్నాడు. సాధారణంగా ఆ లిఫ్టును జె.ఆర్.డి. మాత్రమే ఉపయోగిస్తారు. ఆ విషయం గుర్తుకురాకో, ఇంకా ఆలస్యం కాకూడదనో లిఫ్టు దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు దాము. ఈలోపు ఎవరిదో గంభీరమైన స్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు దాము.
జె.ఆర్.డి!!
దామూకి గుండె ఆగినంత పనైంది. మనిషి బిర్ర బిగుసుకుపోయాడు. సారీ చెబుతున్నట్లుగా నవ్వు ముఖం పెట్టి పక్కనే ఉన్న మెట్లవైపు వెళ్లాడు. రెండు మెట్లు ఎక్కగానే వెనుక నుంచి ఖంగున జె.ఆర్.డి. పిలుపు. ‘‘ఇటొచ్చెయ్. వెళ్దాం’’ అంటున్నారు ఆయన. పరుగున లిఫ్టులోకి వచ్చి ఒద్దికగా, ఒక పక్కగా నిలబడి ‘‘థాంక్యూ సర్’’ అన్నాడు దాము.
‘‘ఏ ఫ్లోర్’’ అని అడిగారు జె.ఆర్.డి. సెకండ్ ఫ్లోర్ అని చెప్పగానే, అక్కడ ఆపమని లిఫ్టుబాయ్‌కి చెప్పారు జె.ఆర్.డి.
సెకండ్‌ఫ్లోర్‌లో దిగిపోతూ వెనక్కి తిరిగి మళ్లీ థ్యాంక్స్ చెప్పాడు దాము. చిరునవ్వుతో తల ఊపారు జె.ఆర్.డి.
తర్వాత కొంతకాలం వరకు దాము ఆ షాక్ నుంచి తేరుకోలేదు.
జె.ఆర్.డి. దేన్నీ వృథా కానివ్వరు. ముఖ్యంగా సమయాన్ని! ఆఫీసుకు వస్తున్నప్పుడు దారిలో ఎవరైనా వాచ్ చూసుకుంటూ హడావుడి పడుతుంటే డ్రైవర్ చేత కారు ఆపించి, లిఫ్ట్ ఇస్తారు. అది తన పౌరధర్మం అని భావిస్తారు.
తనే కాదు, ఎవరి నిమిషాన్నీ వృధా కానివ్వరు జె.ఆర్.డి. అలాగే ఏ చిన్న సలహానూ తీసిపారెయ్యరు. ఇందుకు ప్రత్యక్ష సాక్షి... ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధ.

*******

అప్పట్లో సుధ... సుధామూర్తి కాదు. సుధా కులకర్ణి. బెంగుళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క్యాంపస్ విద్యార్థిని. లేడీస్ హాస్టల్లో ఉండి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఓరోజు ఆమె... లెక్చర్ హాల్ కాంప్లెక్స్ నుంచి హాస్టల్‌కు తిరిగి వెళుతుంటే నోటీస్ బోర్డులో టెల్కో (ఇప్పటి టాటా మోటార్స్) కంపెనీ ఉద్యోగ ప్రకటన కనిపించింది.
‘‘కష్టించి పని చేయగల అత్యుత్తమప్రతిభావంతులైన యువ ఇంజినీర్లకు టెల్కో ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అన్నది సారాంశం.
దాని కిందే చిన్న నోట్ : మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయనవసరం లేదు.
నోట్ చదవగానే సుధ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. అందులోని లింగ వివక్షను ఆమె సహించలేకపోతోంది. నిజానికి ఆమెకా ఉద్యోగం చెయ్యాలని లేదు. కానీ నోట్ చూశాక ఆ కంపెనీ యజమానికి కనువిప్పు కలిగించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. హాస్టల్ గదికి రాగానే పోస్ట్ కార్డు అందుకుని జె.ఆర్.డి. టాటాకు ఉత్తరం రాయడం మొదలు పెట్టారు. టెల్కో టాటా వాళ్లది కాబట్టి, టాటాకు అధినేత జె.ఆర్.డి. కాబట్టి నేరుగా ఆయన్ని ఉద్దేశించే రాశారు. వాస్తవానికి అప్పటి టెల్కో ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్.
‘‘టాటాలంటే గొప్పవాళ్లు. ఇండియాకు రక్తమాంసాలు ఇచ్చినవాళ్లు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి విద్యాసంస్థల ఆవిర్భావం టాటాల పుణ్యమే. అదృష్టవశాత్తూ నేనక్కడే చదువుకున్నాను. కానీ టెల్కో వంటి టాటా కంపెనీ లైంగిక వివక్షను పాటించడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’.
ఇంతవరకు రాసి సుధ ఆ ఉత్తరాన్ని డెరైక్టుగా జె.ఆర్.డి.కి పోస్ట్ చేశారు. తర్వాత ఆ విషయం మరిచిపోయారు. వారం తర్వాత ఆమెకొక టెలిగ్రామ్ వచ్చింది. టెల్కో ఇంటర్వ్యూకి రమ్మని!! పుణె దగ్గర పింప్రీలో ఇంటర్వ్యూ. సుధ వెళ్లింది.
బోర్డు సభ్యులలో ఒకరు సుధను చూస్తూ - ‘‘ఈ అమ్మాయే జె.ఆర్.డి.కి ఉత్తరం రాసింది’’అని పక్కన ఉన్నవాళ్లకు చెప్పడం ఆమె గమనించింది. ఏదో పిలవడానికి పిలిచారు కానీ, తనకా ఉద్యోగం రాదని సుధ అనుకుంది. అందుకే నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చింది. పనిలో పనిగా అమ్మాయిలను ఉద్యోగాలకు వద్దనడం న్యాయమేనా? అని అడిగింది.
ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్లలో ఒక పెద్దాయన సౌమ్యంగా సమాధానం చెప్పారు. ‘‘చూడమ్మా... ఇది కో-ఎడ్యుకేషన్ కాలేజీ కాదు. కర్మాగారం. మీలాంటి ప్రతిభ గల అమ్మాయిల్ని రిసెర్చ్ లేబరేటరీలలోకి తీసుకోగలం కానీ, చూస్తూ చూస్తూ యంత్రాల మధ్యకు పంపలేం కదా. అందుకే అలా నోట్ పెట్టాం’’ అన్నారు.
‘‘ఎక్కడో ఒక చోట ఈ సంప్రదాయానికి బ్రేక్ పడాలి కదా’’ అంది సుధ. ఆమె అన్నట్లే బ్రేక్ పడింది. ఆమెకా ఉద్యోగం వచ్చింది. తర్వాత సుధా కులకర్ణి... సుధామూర్తి అయింది. అయితే పుణె నుంచి బాంబే బదలీ అయ్యేవరకు ఆమెకు జె.ఆర్.డి. దర్శనభాగ్యమే కలగలేదు. కంపెనీ ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్‌కు ఏవో నివేదికలు అందించడం కోసం బాంబే హౌస్ ఫస్ట్ ఫ్లోర్‌లో వేచి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓరోజు అమెకు జె.ఆర్.డి. కనిపించారు. అదే మొదటిసారి సుధ ఆయన్ని చూడ్డం!
‘‘జే.. టెల్కో ఫ్యాక్టరీలో చేరిన మొట్టమొదటి ఉమన్ ఇంజినీర్’’ అంటూ సుధను పరిచయం చేశారు సుమంత్. సుధలో వణుకు మొదలైంది. దేవుడా దేవుడా పోస్ట్ కార్డ్ సంగతి ఎత్తకుండా చూడు అనుకుంది. జె.ఆర్.డి. చిరునవ్వు నవ్వి సుమంత్‌తో మాటల్లో పడిపోయారు.

ఆ తర్వాత అప్పుడప్పుడు టాటాహౌస్‌లో జె.ఆర్.డి. తారసపడుతూనే ఉన్నారు సుధకు.
ఓరోజు - ఆఫీస్ టైమ్ అయిపోయాక మూర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సుధ. పక్కనే వచ్చి నిలబడ్డారు జె.ఆర్.డి. ఆవిడకు మళ్లీ పోస్ట్ కార్డ్ గుర్తొచ్చింది.
‘‘ఇక్కడేం చేస్తున్నావమ్మా’’ అని అడిగారు టాటా అధినేత తన ఉద్యోగిని.
‘‘సర్.. ఆఫీస్ టైమ్ అయిపోయింది. పికప్ చేసుకోడానికి నా భర్త వస్తానన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నా’’ అని భయం భయంగా చెప్పారు సుధ.
‘‘చీకటి పడుతోంది. ఆయన వచ్చేవరకు నేనూ ఇక్కడే ఉంటాను’’అన్నారు జె.ఆర్.డి.
సుధ ఫ్రీజ్ అయిపోయింది. కనుకొనల్లోంచి ఆయన్నే చూస్తోంది. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా ఉన్నారు ఆయన. వృద్ధాప్యపు ఛాయలు ఆయన ముఖంలోని కాంతిని పోగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. సుధ ఆలోచిస్తోంది. దేశంలోనే అత్యంత గౌరవనీయుడైన ఒక పారిశ్రామికవేత్త ఒక సగటు ఉద్యోగికి సహాయంగా వేచి ఉండడం ఆమెను ఉద్వేగానికి లోను చేస్తోంది. క్షణాలు గడుస్తున్నాయి. మూర్తి వస్తూ కనిపించాడు. రివ్వున ఎగిరిపోయింది సుధ.
జె.ఆర్.డి. ఆమెను పిలిచి చెప్పారు - ‘‘ఇంకె ప్పుడూ తన భార్యను ఇలా నిరీక్షింపజెయ్యొద్దని నీ భర్తకు చెప్పు’’ అన్నారు. జె.ఆర్.డి.లోని కేరింగ్ స్వభావానికి చిన్న ఉదాహరణ మాత్రమే ఇది.
1982లో టెల్కో నుంచి బయటికి వచ్చారు సుధ. నిజానికి అంతమంచి ఉద్యోగం మానేసి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి. ఫైనల్ సెటిల్‌మెంట్ అయ్యాక బాంబే హౌస్ మెట్లు దిగుతుంటే జె.ఆర్.డి. ఎదురయ్యారు ఆమెకు. ఏదో ఆలోచనలో ఉన్నారు. ఆయన దగ్గర వీడ్కోలు తీసుకోవడం కోసం ఆగారు సుధ.
‘‘ఎలా ఉన్నావమ్మాయ్’’ అని అడిగారు జె.ఆర్.డి.
‘‘ఉద్యోగం మానేస్తున్నాను సర్’’ అని చెప్పింది సుధ.
‘‘మానేసి?’’
‘‘పుణె వెళ్లిపోతున్నాను సర్. నా హస్బెండ్ అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. పేరు ఇన్ఫోసిస్’’.
‘‘ఓ! ఆ తర్వాత ఏమిటి? ఐ మీన్... అది సక్సెస్ అయ్యాక ఏమిటి?’’
సుధ క్షణం సేపు ఆగింది. ‘‘సక్సెస్ అవుతామో లేదో తెలీదు సర్’’ అంది.
జె.ఆర్.డి. ఆమె వైపు చూశారు.‘‘ ఏ పనినీ అపనమ్మకంతో మొదలుపెట్టకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. సక్సెస్ అయినప్పుడు సమాజానికి మనం ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే సమాజం మనకు ఇచ్చినందువల్లే తిరిగి ఇచ్చే స్థితికి చేరుకుని ఉంటాం కాబట్టి. ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
జె.ఆర్.డి తను ఇవ్వగలిగినంతా సమాజానికీ, దేశానికీ ఇచ్చారు. ఆ ప్రయత్నంలో ఊహించని విధంగా ఎదుైరె న విమర్శలను తట్టుకుని సమర్థంగా నిలబడ్డారు. పారిశ్రామిక వేత్తలు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు స్థిరంగా నిలబడి తిప్పికొట్టారు. ఒక సందర్భంలో గాంధీజీతో కూడా తలపడ్డారు!

*******

1945 - మే - మొదటివారం.
ఐదు కోట్ల మందిని బలితీసుకున్న రెండో ప్రపంచం సమాప్తం అయింది! ఐరోపాలో దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఇక్కడ - బొంబాయిలో గుడి గంటలు మోగుతున్నాయి. యుద్ధం అంతమైనందుకు భారతీయులు దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కానీ అదే వారం ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరు మహాత్మాగాంధీ, ఇంకొకరు జె.ఆర్.డి. టాటా!
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కోసం భారతదేశ పారిశ్రామికవేత్తల బృందం ఇంగ్లండ్, అమెరికా దేశాలను పర్యటించడానికి సిద్ధం కావడం సిగ్గుచేటని గాంధీజీ అన్నారు. ఆ మాట జె.ఆర్.డి.కి ఆగ్రహం తెప్పించింది. ‘‘భారతదేశ పారిశ్రామికాభివృద్ధి కోసం గాంధీజీ అనుకుంటున్న సిగ్గుచేటు పని చెయ్యడానికి ఎవరైనా వెనకాడవలసిన పనిలేదు’’ అని ప్రకటించారు. గాంధీ మార్గాన్ని గౌరవించిన జె.ఆర్.డి... గాంధీజీ స్వదేశీ సిద్ధాంతంలోని అభివృద్ధి అవరోధక కోణాలపై బాహాటంగానే చర్చించారు. అదీ జె.ఆర్.డి. సంకల్పబలం.

పారిశ్రామిక సామ్రాజ్యాధీశుడిగా జె.ఆర్.డి.ని కాసేపు పక్కన పెట్టి చూస్తే ఆయనలో భిన్నమైన వ్యక్తి కనిపిస్తారు. నాయకత్వం అంటే ఆయన దృష్టిలో ఆధిక్యం ప్రదర్శించడం కాదు. ఆత్మీయంగా ఉండడం. డబ్బు సంపాదన కోసం ఆయన ఏ పనీ చెయ్యలేదు. డబ్బు వస్తుందా లేదా అని లెక్కలేసుకుని ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ‘‘డబ్బు ఎరువు లాంటిది. కుప్పగా పోస్తే కుళ్లి కంపు కొడుతుంది. విస్తారంగా చల్లితే పంటగా ఎదుగుతుంది’’ అంటారు జె.ఆర్.డి! సామాన్యుల ఆకలి ఆహారంతో తీరితే.. అసామాన్యుల క్షద్బాధ సేవాకార్యక్రమాలతో కానీ చల్లార దని కూడా ఆయన అంటుండేవారు.
‘‘పని చేస్తున్నప్పుడు అంతా నీ మీదే ఆధారపడి ఉన్నదనుకుని పని చెయ్యి. ప్రార్థిస్తున్నప్పుడు భారమంతా దేవుడి మీదే వేసి ప్రార్థించు’’ అని జె.ఆర్.డి. చెప్పిన మాట ఇవాళ్టికీ... కార్పోరేట్ ఆఫీసులను వేదమంత్రమై నడిపిస్తోంది.



జె.ఆర్.డి. గురించి మరికొంత
బాల్యమంతా ఫ్రాన్స్‌కు, భారత్‌కు మధ్య గడిచింది. (మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ కుటుంబం రెండేళ్ల పాటు జపాన్‌లో కూడా గడిపింది.)

చిన్నప్పుడు జె.ఆర్.డి.కి ఫ్రెంచి తప్ప మరే భాషా సరిగ్గా వచ్చేది కాదు.

కేంబ్రిడ్జిలో ఇంజినీరింగ్ చదవాలని ఆయన కోరిక. అందుకోసం మంచి ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఇంగ్లండ్ వెళ్లాడు.

కోర్సు పూర్తి కాకుండానే జె.ఆర్.డి. కి ఫ్రాన్స్ నుంచి పిలుపు వచ్చింది. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఫ్రాన్స్ సైన్యంలో పని చెయ్యాలి. అందుకే ఆ పిలుపు.

ఏడాది అయ్యాక - టాటా స్టీల్ వ్యవహారాలు చూసుకోడానికి రమ్మని - భారత్‌లో తండ్రి నుంచి పిలుపు వచ్చింది.

అలా ఇంజినీరింగ్ చదవాలన్న జె.ఆర్.డి. కోరిక నెరవేరలేదు.

టాటా స్టీల్ డెరైక్టర్-ఇన్‌చార్జి జాన్ పీటర్‌సన్ దగ్గర వ్యాపార లావాదేవీలలో ఐదేళ్ల పాటు జె.ఆర్.డి. శిక్షణ పొందారు.

ఛైర్మన్‌గా జె.ఆర్.డి బాధ్యతలు స్వీకరించే నాటికి టాటా గ్రూపులో 14 కంపెనీలు ఉండేవి. వాటి టర్నోవర్ సుమారు రూ.250 కోట్లు.

ఛైర్మన్‌గా జె.ఆర్.డి రిటైర్ అయ్యేనాటికి టాటా గ్రూపులో 50కి పైగా కంపెనీలు ఉన్నాయి. వాటి టర్నోవర్ సుమారు రూ. 10000 కోట్లు.

1938 జూలైలో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేనాటికి జె.ఆర్.డి వయస్సు 34.

జె.ఆర్.డి. దగ్గర ఎప్పుడూ టేప్ రికార్డర్ ఉండేది. తన ప్రసంగాలను అందులో రికార్డ్ చేసుకుని రెండుమూడుసార్లు విని సరిచేసుకునేవారు. తర్వాతే ప్రసంగించేవారు.

‘ఎయిర్ ఇండియా’ సంస్థ జె.ఆర్.డి. నెలకొల్పిందే. మొదట దాని పేరు ‘టాటా ఎయిర్‌లైన్స్’. ప్రభుత్వం దాన్ని జాతీయం చేశాక ఎయిర్ ఇండియా అయింది.



జె.ఆర్.డి. స్వభావం
టైమ్ అంటే టైమే.

ఉద్యోగులతో స్నేహ సంబంధాలు

నిజాయితీ

బ్యూరోక్రాట్ల పెత్తనంపై అసహనం.

భారతదేశానికి ఏదైతే మంచిదో టాటాలకూ అదే మంచిది అనే విశ్వాసం.

0 comments:

Post a Comment