Tuesday, December 13, 2011

అబ్రహాం లింకన్ బెస్ట్ ప్రెసిడెంట్

అమెరికా చరిత్రలో ది బెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు?
అమెరికా మెట్టమొదటి అధ్యక్షుడా? కాదు.
లాడెన్‌ని మట్టుపెట్టిన ఇప్పటి అధ్యక్షుడా? కానే కాదు.
మధ్యలో నలభై రెండు మంది ప్రెసిడెంట్లు ఉన్నారు. వీళ్లలో ఎవరు?
ఎప్పుడు అభిప్రాయసేకరణ జరిగినా... మొదటిస్థానంలో నిలిచే పేరు...
అబ్రహాం లింకన్. తర్వాతే జార్జి వాషింగ్టన్, రూజ్వెల్ట్!
అమెరికాకు ఆకృతిని, రక్తమాంసాలను ఇచ్చిన పితామహులు, అధ్యక్షులు
ఉంటే ఉండొచ్చు కానీ..
ఆ దేశానికి ఆత్మను ఇచ్చిన మహనీయుడుమాత్రం లింకనే!!
యుద్ధాన్ని ఇష్టపడని ఈ వ్యక్తి ద్వేషం చిమ్మినవారిని క్షమించిన
ఈ వ్యక్తి ప్రపంచ పౌరుల ఆరాధ్య అధ్యక్షుడిగా
రాజకీయాలలో ఆదర్శ నాయకుడిగా ఎదగడం వెనుక ఉన్న
స్ఫూర్తిదాయకమైన సందర్భాల సమాహారమే ఈవారం ‘బయోగ్రఫీ’


బయోడేటా
అబ్రహాం లింకన్, 16వ అమెరికా అధ్యక్షుడు
12 ఫిబ్రవరి 1809 - 15 ఏప్రిల్ 1865

జన్మస్థలం : కెంటకీ, అమెరికా
తల్లిదండ్రులు : థామస్ లింకన్,
నాన్సీ హాంక్స్
మారుతల్లి : శారా బుష్ జాన్‌స్టన్
తోబుట్టువులు : అక్క శారా, తమ్ముడు థామస్ జూ॥
భార్య : మేరీ టాడ్ (వివాహం : 4 నవంబర్ 1842)
సంతానం : నలుగురు కొడుకులు (రాబర్ట్, ఎడ్వర్డ్, విల్లీ, థామస్ టాడ్) వీరిలో ఎడ్వర్డ్ నాల్గవ యేట,
వీల్లీ పన్నెండవ యేట, టాడ్ పద్దెనిమిదవ యేట చనిపోయారు)
అధ్యక్షుడిగా : 4 మార్చి 1861 - 15 ఏప్రిల్ 1865
దాస్యవిముక్తి ప్రకటన : 1 జనవరి 1863

ఫిబ్రవరి - మార్చి - ఏప్రిల్... లింకన్ జీవితం.
ఫిబ్రవరిలో పుట్టారు. మార్చిలో ప్రెసిడెంట్ అయ్యారు. ఏప్రిల్‌లో... విద్వేషానికి బలయ్యారు!
యాభై ఆరేళ్ల పాటు ఈ మూడు నెలల మధ్య లింకన్ జీవితం మలుపులు తిరిగి విషాదాంతం అయింది.

*******

నీతి - నిజాయితీ - స్వయంకృషి ... లింకన్ వ్యక్తిత్వం.
జీవితంలో ఎన్ని దెబ్బలు లింకన్‌కు! లేమిలో పెరిగాడు. పూటపూటకూ పస్తులున్నాడు. రెండుసార్లు వ్యాపారంలో తలకిందులయ్యాడు. ఎనిమిదిసార్లు ఎన్నికల్లో ఓడిపోయాడు. నరాలు చచ్చుబడి ఆరు నెలలు మంచానికి అంటుకుపోయాడు. మరీ దౌర్భాగ్యం... తొమ్మిదేళ్లకే తల్లిని పోగొట్టుకున్నాడు!
నీతిగా బతకమని అమ్మ చెప్పింది. కష్టపడి బతకమని అంతరాత్మ చెప్పింది. పదిమందిని బతికించమని ైదైవం చెప్పింది. జీవితమంతా ఈ ముగ్గురు చూపిన తోవలోనే నడిచాడు లింకన్. అందుకే ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడగలిగాడు. నాయకుడయ్యాడు.

*******

దాస్య విముక్తి - దేశ సమైక్య స్థితి ... లింకన్ లక్ష్యం.
ఆఫ్రికన్ బానిసలకు విముక్తి ప్రసాదించినందుకు సొంతజాతికే శత్రువయ్యారు. ముక్కలు ముక్కలు కాబోతున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలను కలిపి ఉంచే ప్రయత్నంలో చివరికి ప్రాణత్యాగం చేశారు.
లింకన్ ... బిలాంగ్స్ టు ది ఏజెస్!

*******

మొదట అనుకున్న ప్రకారం అయితే జాన్ విల్కెస్ బూత్... అబ్రహాం లింకన్‌ని కిడ్నాప్ చెయ్యాలి! కిడ్నాప్ చేశాక, ‘‘మా మనుషుల్ని విడుదల చేస్తేనే మన అధ్యక్షుడిని వదిలిపెడతాం’’ అని ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చెయ్యాలి. అదీ పథకం. విల్కెస్ రంగస్థల నటుడు. అమెరికా నుంచి వేరుపడేందుకు ప్రయత్నించి అంతర్యుద్ధానికి కారణమైన దక్షిణ అమెరికా బానిస రాష్ట్రాల (బానిసత్వ వ్యవస్థ చట్టబద్ధమై ఉన్న రాష్ట్రాలు) సానుభూతిపరుడు. లింకన్ ప్రభుత్వం ఆ తిరుగుబాటును అణిచివేసి, వేర్పాటువాదుల్ని జైల్లో పెట్టింది. వారిని విడిపించుకోవడం కోసమే లింకన్‌ని కిడ్నాప్ చెయ్యాలనుకున్నాడు విల్కెస్.

అయితే - లింకన్ ప్రసంగం విన్నాక అతడి నిర్ణయం మారింది! కిడ్నాప్ కాదు, మనిషినే లేకుండా చెయ్యాలని అనుకున్నాడు. అంతకుముందే అతడు లింకన్ ప్రసంగం విన్నాడు. రెండోసారి అధ్యక్షుడు అయిన సందర్భంగా లింకన్ ఇచ్చిన ప్రసంగం అది. నల్లజాతి ప్రజలకు ఓటు హక్కు కల్పిస్తాననని హామీ ఇచ్చారు లింకన్. ఆ మాట విల్కెస్‌కు కోపం తెప్పించింది. పుండు మీద కారప్పొడిలా రాలి పడింది. ‘వేరుపడతానంటే పడనివ్వడు కానీ, సమానహక్కులు కల్పిస్తాను కలిసి ఉండండి అంటాడా’ అని విల్కెస్ ఆగ్రహం! అందుకే అయన్ని హతమార్చాలనుకున్నాడు. అనుకున్నట్లే చేశాడు!!

వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో - బాల్కనీలో కూర్చుని ‘అవర్ అమెరికన్ కజిన్’ నాటకాన్ని దీక్షగా చూస్తున్న లింకన్‌ను... వెనుక వైపు వచ్చిన విల్కెస్, తలకు అతి సమీపంగా తుపాకీ గురిపెట్టి కాల్చాడు. లింకన్ తల వాలిపోయింది. రాత్రి 10.13 గం. ఈ సంఘటన జరిగింది. లింకన్ కోమాలోకి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం గం.7.22 లకు ఆయన మరణించారు. వార్త విన్న మరుక్షణం ప్రపంచమంతటా విషాదం కమ్ముకుంది. అంతిమక్రియల అనంతరం - ‘‘నౌ హి బిలాంగ్స్ టు ది ఏజెస్’’ అని సైనిక దళం నివాళులర్పించింది.

*******

లింకన్ సకల కాలాల, సకల స్థలాల ప్రియతముడు.
లింకన్‌ను ఒక కాలానికి, ఒక దేశానికి, ఒక జాతికి, ఒక సమూహానికి మాత్రమే చెందిన వ్యక్తిగా గుర్తించడానికి వీలుకాదు. జీవన్మరణ సమస్యలు అతడిని శక్తిమంతుడిగా మార్చాయి. వరుస ఓటములు అతడిని విజేతగా నిలబెట్టాయి. అమెరికా గానీ, తక్కిన ప్రపంచ దేశాలు కానీ మునుపెన్నడూ భూమి మీద ఎక్కడా ఇలాంటి నాయకుడి జాడలు చూడలేదని ఈనాటికి ఒప్పుకుంటూనే ఉన్నాయి.

లింకన్ రాజనీతిజ్ఞుడు. దేశం రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నప్పుడు, సైనిక సంక్షోభంలో ఉన్నప్పుడు, మానవీయ విలువల సంక్షోభంలో ఉన్నప్పుడు, సంక్షోభాలన్నీ కలిసి అంతర్యుద్ధంగా మారినప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఆయన సమైక్యంగా ఉంచగలిగారు.
లింకన్ మహోన్నతుడు. పేదల్ని ఆదరించాడు. రాజకీయాలలో నిస్వార్థ సేవలు ఉండవనే భావనను పోగొట్టి సాధారణ పౌరులకు దగ్గరయ్యాడు. ఒక మంచి వ్యవస్థను నిర్మించాడు. బానిసలకు విముక్తి ప్రదాత అయ్యాడు. నిరుపేద కుటుంబం నుంచి ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎదిగిన స్వయంకృషీవలుడు లింకన్. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు, అవి నేర్పిన పాఠాలు ఉన్నాయి.

*******

అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్‌కు గొప్ప లక్ష్యాలు ఉన్నాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడు అవాలన్న లక్ష్యం మాత్రం అతడికి పదవయేటే ఏర్పడింది. ఒక చిన్న సంఘటన లింకన్‌కు అంత పెద్ద లక్ష్యం ఏర్పడడానికి కారణమైంది. చదివి ఇచ్చే ఒప్పందం మీద క్రాఫర్డ్ అనే సంపన్న రైతు దగ్గర లింకన్ ఒకసారి వీమ్స్ రాసిన ‘లైఫ్ ఆఫ్ వాషింగ్టన్’ పుస్తకం అరువు తీసుకున్నాడు. అది అమెరికా తొలి అధ్యక్షుడు వాషింగ్టన్ జీవిత చరిత్ర. ఇంకొన్ని పేజీలు చదివితే పూర్తవుతుందనగా, నిద్ర తరుముకుని వస్తుండడంతో, పుస్తకాన్ని భద్రంగా చేతికి అందుబాటులో ఉన్న అరలో ఉంచి, మంచంపై వాలిపోయాడు లింకన్. అయితే ఆ రాత్రి వచ్చిన ఈదురుగాలి నుంచి లింకన్ కుటుంబం ఉంటున్న ఇల్లు క్రాఫర్డ్ పుస్తకానికి రక్షణ కల్పించలేకపోయింది. తెల్లారేసరికి పుస్తకం తడిసి ముద్దయింది! లింకన్ చాల బాధపడ్డాడు. ఏ ముఖం పెటుకుని ఆయనకు కనిపించాలి? ఉన్న విషయం చెప్పి ఏదో ఒక విధంగా ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తిన్నగా క్రాఫర్డ్ దగ్గరకు వెళ్లాడు.
‘‘మిస్టర్ క్రాఫోర్డ్. మీ పుస్తకాన్ని మీకు జాగ్రత్తగా తిరిగిచ్చేస్తానని మాట ఇచ్చాను. కానీ అలా ఇవ్వలేక పోతున్నాను. పుస్తకం పూర్తిగా పాడైపోయింది. అందుకు నా నిర్లక్ష్యం కారణం కాదు. దురదృష్టవశాత్తూ అలా జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తే మీకు నష్ట పరిహారం ఇచ్చినట్లు అవుతుందో దయచేసి చెప్పండి’’ అని అడిగాడు లింకన్.
క్రాఫోర్డ్ నిక్కచ్చి మనిషి. లింకన్ చేతిలో ఉన్న తన పుస్తకాన్ని చూశాడు. అది పుస్తకంలా లేదు!!
‘‘ఐ యామ్ సారీ మిస్టర్ క్రాఫోర్డ్. దీనికి తగిన మూల్యం చెల్లించడానికి నా దగ్గర డబ్బులేదు. బదులుగా మీకు ఏదైనా సహాయం చేసిపెడతాను’’ అన్నాడు లింకన్ .
‘‘నా పొలంలో మూడురోజులు మొక్కజొన్న కంకుల్ని కోసి పెట్టు. సరిపోతుంది. పుస్తకాన్ని కూడా నువ్వే ఉంచుకోవచ్చు’’ అన్నాడు క్రాఫోర్డ్. అలాగే చేసిపెట్టాడు లింకన్.
పుస్తకం చదివాక వాషింగ్టన్ చాలాసార్లు లింకన్ కలలోకి వచ్చారు. ఎప్పటికైనా తను అమెరికా ప్రెసిడెంట్ అవాలని ఆ వయసులోనే తీర్మానించుకున్నాడు.

*******

లింకన్ తండ్రి థామస్. తల్లి నాన్సీ హాక్స్. అక్క శారా. తమ్ముడు థామస్ జూనియర్. ఇదీ కుటుంబం. కెంటకీలో చెక్కలతో చేసిన ఇంట్లో నివాసం. తల్లిపోయాక తండ్రికి మానసికంగా దూరమయ్యాడు లింకన్. అదే సమయంలో మారుతల్లికి చేరువయ్యాడు. ఇంటి బాధ్యతల్ని మీద వేసుకున్నాడు. అక్క శారా ఇరవై ఏళ్లకే పురిటి నొప్పులతో చనిపోయింది. అంతకు చాలాకాలం క్రితమే నెలల బిడ్డగా తమ్ముడు థామస్ చనిపోయాడు. కెంటకీ నుంచి ఇల్లినాయిస్ సమీపంలోని డెకాటర్‌కు నివాసం మార్చాక పూర్తిగా పనిలో పడిపోయాడు లింకన్. ఈ పనీ ఈ పనీ లేదు. పడవల్నీ తయారు చేయడం. పడవలపైకి ప్రయాణికుల సమాన్లను చేరవేయడం, రంపపు మిల్లులో దుంగల్ని కోయడం..! ఎంత పని చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. చదువుకు కావలిసిన డబ్బును తనే సంపాదించుకున్నాడు. లా చదివాడు. క్రమంగా రాజకీయాల వైపు మళ్లాడు.

*******

లింకన్‌ను బలమైన నాయకుడిగా నిలబెట్టిన సుగుణాలలో నిజాయితీ మొదటిది. లింకన్‌కు ‘హానెస్ట్ ఆబ్’ అని పేరు. పచ్చి అబద్ధాల కోరులా, పచ్చి నిజాయితీపరుడున్నమాట! కొంతకాలం ఆయన కిరాణా దుకాణం నడిపారు. కస్టమర్లకు నాణ్యమైన సరుకు ఇచ్చేవాడు. ధరలు కూడా న్యాయంగా ఉండేవి. జనం బాగా వచ్చేవారు. లెక్కలన్నీ కచ్చితంగా ఉండేవి. ఒకరోజు రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లబోయేముందు లెక్కలో చిన్న తేడా వచ్చింది. ఒక కస్టమర్ నుంచి కొన్ని సెంట్‌లు తను ఎక్కువగా తీసుకున్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే బయల్దేరి ఆ కస్టమర్ ఇల్లు కనుక్కుని ఎక్కువగా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేశారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పారు.
ఇంకొకసారి - టీ పొడి కొన్న కస్టమర్‌కు తూకంలో తక్కువగా ఇచ్చిన ట్లు మర్నాడు ఉదయం గమనించిన లింకన్ వెంటనే తక్కువ పడిన టీ పొడిని పొట్లంలో కట్టుకుని కస్టమర్ ఇల్లు వెదుక్కుంటూ వెళ్లి అందజేశాడు. ఆవిడెంతో ఆశ్చర్యపోయారు. ‘తూకం తగ్గినట్లు నాకేమీ అనిపించలేదే’ అన్నారు!
కొన్ని వృత్తులలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండడం కుదరదనుకుంటాం. నిజాయితీగా ఉండకపోవడమే తమ వృత్తి ధర్మం అనుకునే వారూ ఉంటారు. అయితే లింకన్ వేరు. లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో, రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో న్యాయానికి, నైతిక విలువలకు గట్టిగా కట్టుబడి ఉన్నారు ఆయన. లింకన్ తమ మధ్య పక్షి కాదని తోటి న్యాయవాదులు సైతం గుర్తించి ఆయన్ని ఆయనలాగే ఉండనిచ్చారు. ‘‘ఆబ్ అసలు నాలుగు రాళ్లు వెనకేసుకోగలడా?’’ అని వారు అనుకున్న సంఘటన ఒకటి... లింకన్ న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో జరిగింది.
లింకన్, ఆయన స్నేహితులు కలిసి గుర్రాలపై ఇల్లినాయిస్ చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టివచ్చేందుకు బయల్దేరారు. మధ్యలో ఒకచోట లింకన్‌కు నేలపై రెండు పక్షి పిల్లలు కనిపించాయి. వెంటనే గుర్రాన్ని ఆపి వాటిని తన చేతుల్లోకి తీసుకున్నారు లింకన్. ఆగకుండా వెళ్లిపోయిన మిత్రులు కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూసుకుంటే లింకన్ కనిపించలేదు! గుర్రాలకు నీళ్లపెట్టడం కోసం వారంతా ఒక ప్రదేశంలో ఆగినప్పుడు లింకన్ ఏమయ్యాడన్న ప్రశ్న వచ్చింది. కొందరు ఆందోళన చెందారు. ఈలోగా లింకన్ దూరంగా వస్తూ కనిపించారు. ‘‘ఏమయ్యావ్ మిత్రమా? అని వాళ్లంతా ఆశ్చర్యంగా అడిగారు. ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.
‘‘ఆ పక్షి పిల్లల్ని వాటి తల్లి చెంతకు చేర్చకపోతే ఈ రాత్రికి నాకు నిద్రపట్టేది కాదు’’ అన్నారు లింకన్!
ఇలాంటివే మరికొన్ని సందర్భాలు ఉన్నాయి.
పెద్ద లాయర్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రోజుల్లో లింకన్ ఒకనాడు స్ప్రింగ్‌ఫీల్డ్ పట్టణ వీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటే పదేళ్ల చిన్నారి పెద్దగా ఏడుస్తూ కనిపించింది. ఒక ట్రంకు పెట్టె ఆమె సమీపంలో ఉంది. లింకన్ ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి ‘‘ఎందుకు ఏడుస్తున్నావ్?’’అని అడిగాడు.
‘‘నేను డెకాటర్ వెళ్లాలి. రైల్వేస్టేషన్ వెళ్లడానికి ఒక్క గుర్రబ్బగ్గీ నన్ను చూసి ఆగడం లేదు. మరి నేనెలా వెళ్లడం’’ అని మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టింది.
లింకన్ ఆమెను సముదాయించాడు. ‘‘ఏడ్వకు, బండి రాకపోతేనేం. నేనొచ్చాను కదా’’ అన్నాడు. ఆమె ట్రంకు పెట్టెను తన భుజం మీద పెట్టుకుని, అమె చెయ్యి పట్టుకుని స్ప్రీంగ్ ఫీల్డ్ వీధుల గుండా అర మైలు దూరం నడిచి రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. ఆ చిన్నారిని భద్రంగా టైన్ ఎక్కించి. ట్రంకుపెట్టెను జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పి ఆమె దగ్గర్నుంచి చిరునవ్వుల వీడ్కోలు తీసుకున్నాడు.
ఇలాంటి కోణాలో లింకన్‌లో అనేకం ఉన్నాయి.
కేసులు వాదిస్తున్నప్పుడు, తన క్లయింట్‌దే తప్పుందని లింకన్‌కు అనిపిస్తే, ఆ కేసును మధ్యలోనే వదులుకునేవారు. ఒక కేసులో వాదోపవాదాలు నడుస్తుండగా ఇలాగే జరిగింది! తప్పు తన మనిషిలో ఉందని లింకన్ గ్రహించారు. వెంటనే కేసు నుంచి వైదొలిగారు. ఆ కేసును లింకన్ సహచరుడైన ఇంకో న్యాయవాది వాదించి, క్లయింట్‌ను గెలిపించాడు. క్లయింట్ ఇచ్చిన డబ్బులో సగం వాటాను పదిలంగా తీసుకువచ్చి లింకన్‌కు ఇవ్వబోతే, ఆయన నిరాకరించారు.
అలాగే త న ‘లా-పార్ట్‌నర్’తో లింకన్ లెక్కలు కచ్చితంగా ఉండేవి. ఒక కేసు విషయమై లింకన్‌కు కొంత డబ్బు అందింది. అందులోంచి సగం తీసుకుని, మిగతా సగం మొత్తాన్ని ఒక కాగితంలో చుట్టి, దానిపై ‘బిల్లీ’ అని రాసి జాగ్రత్తగా ఒకపక్క ఉంచారు లింకన్. బిల్లీ అతడి పార్ట్‌నర్. ‘‘ఎందుకలా చెయ్యడం, వాడుకున్నాక తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది కదా’’ అని మిత్రులు అన్నప్పుడు లింక న్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా?
‘‘మా అమ్మకు నేను ప్రమాణం చేశాను. ఎంత అవసరంలో ఉన్నా ఇతరుల డబ్బు వాడుకోనని’’ అని చెప్పారు. దటీస్ లాయర్ లింకన్.

*******

ప్రెసిడెంట్ అవక ముందు ఎలా ఉన్నారో, అయ్యాకా అలానే ఉన్నారు అబ్రహం లింకన్. ఆయనదొక క్రమబద్ధమైన జీవితం. ఆయనివి నిశ్చితమైన అభిప్రాయాలు. సమ్మోహనమైన ఉపన్యాసాలు. ఆ ధోరణీ, తీరు అమెరికా అధ్యక్షులలో అతి తక్కువ మందికి మాత్రమే ఉన్నాయని చరిత్రకారులు అంటారు. శత్రువును ఆదరించిన సందర్భాలు కూడా లింకన్ రాజకీయ జీవితంలో ఉన్నాయి.
ఇల్లినాయిస్‌లో చాలా ఏళ్లు జార్జి పికెట్ అనే వ్యక్తి లింకన్‌కు పరిచయం. తర్వాత అతడు సౌత్ ఆర్మీలో చేరాడు. ఎత్తులతో, జిత్తులతో ‘కాన్ఫెడరసీ’లో జనరల్‌గా ఎదిగాడు. కాన్ఫెడరసీకి ప్రెసిడెంట్ లింకన్ వ్యతిరేకం. ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఉత్తరమెరికా రాష్ట్రాలతో పోరాడుతున్న దక్షిణమెరికా రాష్ట్రాల యూనియన్ ఇది. అమెరికా అంతర్యుద్ధానికి ఈ కాన్ఫెడరసీనే కారణం. యుద్ధం ముగింపునకు వస్తుండగా వర్జీనియాలో చాలా భాగం సౌత్ ఆర్మీ స్వాధీనంలోంచి యూనియన్ ఆర్మీ చేతుల్లోకి వచ్చేసింది. ఆ సమయంలో -
వర్జీనియాలో ఉన్న జనరల్ పికెట్ ఇంటికి స్వయంగా వెళ్లారు అబ్రహాం లింకన్. గడప దగ్గర ఆయన భార్య ఎదురైంది. ఆమె చేతుల్లో చంటి బిడ్డ ఉంది. ‘‘ఇది.. జార్జి పికెట్ ఇల్లేనా?’’ అని అడిగారు లింకన్.
‘‘అవును. నేను ఆయన భార్యను. ఇది మా బిడ్డ’’ అని చెప్పారావిడ.
‘‘నేను. అబ్రహాం లింకన్’’ అన్నారు లింకన్.
ఆవిడ సంతోషంతో కూడిన విస్మయానికి లోనయ్యారు. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్! అంతకు ముందెప్పుడూ ఆమె నేరుగా ఆయన్ని చూడలేదు. భర్త మాత్ర ం అప్పుడప్పుడు ఆమెకు చెబుతుండేవాడు. గర్వం లేని మనిషి అనీ, చిన్నవారికి కూడా మర్యాదిచ్చి మాట్లాడతారనీ, తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంచి మిత్రుడితో వ్యతిరేకించవలసి వస్తోందనీ అంటుండేవాడు.
‘‘మీరు... ప్రెసిడెంట్ అబ్రహాం లింకనా?’’ అందావిడ, అప్రయత్నంగా.
‘‘కాదు, కాదు... జార్జి పికెట్ పాత స్నేహితుడిని’’ అని చెప్పారు లింకన్.
తల్లి చేతుల్ని వదిలించుకుని లింకన్ మీదికి ఎగబాకుతోంది బిడ్డ. ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నారు లింకన్. వాత్సల్యంతో బిడ్డను దీవించాడు. బిడ్డ, నోరంతా తెరిచి నవ్వింది. తన చేతులతో లింకన్ ముఖాన్ని తమిడింది. బిడ్డను తల్లికి ఇచ్చేస్తూ - ‘‘మీ నాన్నకు చెప్పు. ఆ రాస్కెల్ నా స్నేహితుడే. నీ కళ్లలో వెలుగు చూసి వాడిని క్షమించాను. ఆ మాట చెప్పు’’ అన్నారు వీడ్కోలు తీసుకుంటూ.

*******

సెనెటర్‌గా ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్ ఫీల్ట్‌లో లింకన్ అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అది ‘ది డివెడైడ్ స్పీచ్’గా ప్రసిద్ధి చెందింది. ఆ వేళ ఏం జరిగిందంటే - ప్రసంగం కాపీని సరి చూసుకోడానికి లింకన్ తన లా పార్ట్‌నర్ హెర్న్‌డాన్ ఆఫీస్ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. గది తలుపులు వేశాక, జేబులోంచి కాగితాలను తీసి చదవదడం మొదలుపెట్టారు లింకన్. ప్రసంగ పాఠంలోని ప్రతి మాటా ఉద్వేగపూరితంగా, భావయుక్తంగా ఉంది. ఆ క్రమంలో ఒకచోట - ‘సగం మంది బానిసలు, సగం మంది స్వేచ్ఛాజీవులతో ఏ ప్రభుత్వమైనా ఎల్లకాలం మనుగడ సాగిస్తుందన్న నమ్మకం నాకు లేదు’ అన్న వాక్యం వచ్చింది.

‘‘నిజమే కానీ, ఈ సమయంలో ఈ సమస్యను ప్రస్తావించడం మంచి పాలసీ కాకపోవచ్చు’’ అని హెర్న్‌డాన్ సంశయం వ్యక్తం చేశారు. లింకన్ ఆ మాటకు విభేదించారు. ‘‘మంచి పాలసీ కాకపోవచ్చు. కానీ నిజం మాత్రం ఇదే కదా. ఆ నిజం ప్రజలకు తెలియాలి. ఆరు వేల ఏళ్లుగా ఈ రెండు సగాలూ ఇలాగే ఉన్నాయి. వాస్తవం నుంచి మనం పారిపోలేం’’ అన్నారు లింకన్. చివరికి ఆ స్పీచ్ లింకన్ గతినే మార్చేసింది. ప్రజలు అతడిని నమ్మారు. ఓటు వేశారు. అధ్యక్షుడిగా గెలిపించారు.
అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వాషింగ్టన్ వెళ్లడానికి ముందు స్ప్రింగ్‌ఫీల్డ్‌లో భావ గంభీరంగా మాట్లాడారు లింకన్. స్ప్రింగ్‌ఫీల్డ్ ప్రజలు తమ ప్రియతమ నాయకుడికి వీడ్కోలిచ్చేందుకు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. వారి ఉద్దేశించి లింకన్ మాట్లాడారు.

‘‘నా స్నేహితులారా... ఈ ఎడబాటు నాకు ఇష్టం లేనిది. మీ అందరికీ నేను రుణపడి ఉన్నారు. ఇక్కడ నేను పావు శతాబ్దానికి పైగానే ఉన్నాను. నా పిల్లలు ఇక్కడ పుట్టారు. వారిలో ఒకరు ఈ భూమిలోనే ఖననం అయ్యారు. తిరిగి మళ్లీ మిమ్మల్ని ఎంతకాలానికి చూస్తానో తెలీదు. నాపై ఒక పెద్ద బాధ్యత ఉంది. బహుశా అది వాషింగ్టన్ తర్వాత బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులంతా నిర్వర్తించిన బాధ్యతకంటే కూడా పెద్దది. అది దైవికమైనది. దేవుడి తోడ్పాడు లేకుండా పూర్తి కానిది. కనుక నా స్నేహితులారా మీ అధ్యక్షుడి ప్రయత్నాలు సఫలం అవ్వాలని దేవుడిని ప్రార్థించండి. మీరు లేకుండా నేను లేను’’.
ఈ ఆత్మీయతకు ఏ హృదయం ఉప్పొంగకుండా ఉంటుంది? ఏ కన్ను చెమర్చకుండా ఉంటుంది? ఏ మనసు ఆయన్ని మరీ మరీ కలవాలని తపించకుండా ఉంటుంది?

*******


వైట్ హైస్‌లో సాధారణ పౌరులను కలుసుకోవడం కూడా లింకన్‌కు ఒక అత్యవసర సమావేశమే! ఎంత ఒత్తిడిలో ఉన్నా ఏ ఒక్కరినీ నిరాశపరచకూడదని యన తన సిబ్బందికి స్థిర సూచనలు ఇచ్చారు. తెల్లవారు జామున మూడింటికే లింకన్ లేచి కూర్చుంటారు. ఐదింటి నుంచి సందర్శకులతో మాట్లాడేందుకు వెయిటింగ్ హాల్‌కి వస్తారు. ఒకసారి లింకన్‌ను కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. ఉదయం సరిగ్గా అయిదు గంటలకు అపాయింట్ మెంట్. పావు తక్కువ ఐదుకే వచ్చి వేచి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి అధ్యక్ష భవన ఉద్యోగి ఒకరు వస్తే వారిని అడిగాడు - ‘‘నేనిప్పుడు లింకన్‌ని కలవొచ్చా’’ అని. ‘‘కుదరదు’’ అని చెప్పాడా ఉద్యోగి. ‘‘కానీ నాకు అపాయింట్ మెంట్ ఉంది’’అన్నాడు వ్యక్తి.
‘‘ఎన్ని గంటలకు?’’
‘‘ఐదింటికి’’
‘‘ఐతే ఐదుగంటలకే ఆయన మిమ్మల్ని కలుస్తారు’’
సందర్శకుడు ఐదు అవడం కోసం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పక్కగదిలోంచి ఒక గొంతు గంభీరంగా వినిపిస్తోంది. ‘‘లోపలి మాటలు ఎవరివి’’ అని అడిగాడు సందర్శకుడు. ‘‘ప్రెసిడెంట్ స్వరం అది. రోజూ తెల్లవారు జామున నాలుగు నుంచి ఐదు గంటల వరకు లింకన్ ప్రార్థన చేస్తారు. భక్తి ప్రవచనాలు చదువుతారు’’అని చెప్పాడు ఉద్యోగి. లింకన్ తన జీవితంలో ఎప్పుడూ ఈ క్రమాన్ని తప్పలేదు. క్రమబద్ధంగా లేని వ్యక్తులను ఆయన చేరదియ్యలేదు.

*******

లింకన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేనాటికి అంతర్యుద్ధం నుంచి అమెరికా అప్పుడప్పుడే కుదురుకుంటోంది. ఇక పునర్నిర్మాణమే మిగిలిందని అమెరికా ప్రజలు ఎదురుచూస్తుండగా ఆయన హత్య జరిగింది! కానీ లింకన్ వంటి చరిత్రాత్మక పురుషులకు మరణం ఉండదు. అయన అనుసరించిన ఉదాత్తమమైన జీవన శైలి తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.
లింకన్ జననం మానవాళికొక వరం. లింకన్ జీవనం ఆదర్శప్రాయం.



మనుషులంతా ఒక్కటే
లింకన్ స్కూల్లో చదివింది చాలా తక్కువ. కొన్ని నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్లాడు.

పదకొండో యేటే చదువు మాని పన్లోకి వెళ్లాడు.

లింకన్‌కు తన మారుతల్లి శారా బుష్ జాన్‌స్టన్ దగ్గర చనువెక్కువ.

చిన్న వయసులో లింకన్ బైబిల్ ఎక్కువ గా చదివేవారు. బైబిల్ సత్యాలను తన జీవితమంతా ఆచరించారు.

అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు పెన్సిల్వేనియాలోని గెట్టిస్‌బర్గ్‌లో లింకన్ ఇచ్చిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. నాలుగున్నర నెలల విరామం తర్వాత దక్షిణమెరికా రాష్ట్రాల కూటమి ‘కాన్ఫెడరసీ’పై యూనియన్ ఆర్మీ విజయం సాధించిన సందర్బంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. ‘‘ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్’’ అన్న మాట ఆయన ఇక్కడ అన్నదే. తర్వాత అది ఫేమస్ కొటేషన్ అయింది.

సెనెటర్‌గా లింకన్ రెండుసార్లు ఓడిపోయారు.

లింకన్ టాప్ 10 కోట్స్
ఏదైనా నీ లక్ష్య సాధన తర్వాతే.

ఎన్నేళ్లు జీవించామని కాదు, అన్నేళ్లలో ఎంత జీవితం ఉందన్నది చూడాలి.

మనస్తత్వం చెట్టులాంటిది. గుర్తింపు దాని నీడ వంటిది.

సామాన్యులంతా గొప్పవాళ్లే. దేవుడు సామాన్యులనే ఎక్కువగా పుట్టించడం వెనుక కారణమిదే.

గుర్తింపు రాలేదని బాధపడకు. గుర్తింపు కోసం పడే తపనను చల్లారనీయకు.

మనుషులంతా సమానంగా సృష్టింపబడినవారే.

శత్రు సంహారానికి నేను స్నేహ హ స్తం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తాను.

స్వభావాన్ని బట్టే సంతోషం అన్నది దొరుకుతుంది.

నేను మెల్లిగా నడుస్తాను. వెనక్కి మాతం నడవను.

నిన్నటి కన్నా నేడు కాస్తయినా మెరుగవని వ్యక్తిని నేను పట్టించుకోను.

బానిసలకు దేవుడు
లింకన్ అధ్యక్షుడవగానే... అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి వేరుపడుతున్నట్లు ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా ఏర్పడిన 11 దక్షణమెరికా బానిస రాష్ట్రాల కూటమే కాన్ఫెడరసీ. ఈ కూటమిని కాన్ఫెడరేట్ స్టేట్స్ అనీ, కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనీ, సి.ఎస్.ఎ. అని కూడా అంటారు. బానిస రాష్ట్రాలంటే బానిసత్వం చట్టబద్ధమై ఉన్న రాష్ట్రాలు. లింకన్ ప్రభుత్వం తమకు గుర్తింపున్వికపోవడంతో కాన్ఫెడరసీ కయ్యానికి దిగింది. 1861-1865 మధ్య నాలుగేళ్ల పాటు ‘ఫ్రీ స్టేట్’ (బానిసత్వం లేనివి) గా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలపై తిరగబడి అమెరికా అంతర్యుద్ధానికి కారణమయింది. ఆ యుద్ధంలో కాన్ఫెడరేట్స్‌ని లింకన్ వ్యూహం అణిచివేసింది. 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా బానిసత్వాన్ని రద్దు చేశారు.

లింకన్ హాస్య చతురత
లింకన్ సరదాగా మాట్లాడతారు. నవ్విస్తారు. జోకులు వేస్తారు. పిట్టక థలు చె ప్తారు. తన మీద వచ్చిన జోక్‌లను కూడా ఆయన ఎంజాయ్ చేస్తారు.

గాయపడి, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సైనికులను లింకన్ తరచు పరామర్శిస్తుండేవారు. మధ్యమధ్య జోక్స్ చెప్పి వారిని నవ్విస్తుండేవారు. అలా ఒకసారి - బెడ్‌పై ఉన్న సైనికులను నవ్వించి లింకన్ వెళ్లిపోగానే ఒక సందర్శకుడు సైనికుల వార్డులోకి అడుగుపెట్టాడు. వాళ్లింకా నవ్వుల నుంచి తేరుకోలేదు.

‘‘ఎందుకు నవ్వుతున్నారు? మీకు అయిన గాయాలు ఏమంత పెద్దవి కానట్లున్నాయి’’ అన్నాడా సందర్శకుడు.
దానికి ఒక సోల్జర్ సమాధానం:

‘‘నిజమే. ఏమంత పెద్ద గాయం కాదు. ఒక కాలు మాత్రమే పోయింది. లింకన్ వచ్చి జోక్స్ చెప్తానంటే రెండో కాలు పోగొట్టుకోడానికీ నేను సిద్ధంగా ఉన్నాను’’ అన్నాడు. అదీ ప్రెసిడెంట్ లింకన్ ‘విట్టీ పవర్’, ఆయన ఇచ్చే విల్‌పవర్.

1 comments: